అమరావతి: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ యాక్ట్‌కు రూపకల్పన
 చేసింది. ఈ చట్టంలోని అంశాలపై అధికారులతో చర్చించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ వుండేలా చర్యలు తీసుకోనున్నారు. రియల్‌టైంలో డేటా స్వీకరణ చేపట్టాలని స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధించాలని అధికారులకు సీఎం వివరించారు. 

ప్రతి కంపెనీ విధిగా నిర్ణీత కాలానికి ఒకసారి స్వయంగా పీసీబీ సూచనల అమలుపై రిపోర్టు ఇచ్చే విధంగా చట్టంలో ప్రతిపాదించారు. ఈ రిపోర్టులను థర్డ్‌పార్టీ ఆడిటర్‌ చేత పర్యవేక్షణ, సమీక్ష చేయించేలా ప్రతిపాదించారు. థర్డ్‌పార్టీ ఆడిటర్లుగా ప్రఖ్యాత, విశ్వసనీయ ఏజెన్సీలను ఎంపానెల్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎంపానెల్డ్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఏజెన్సీస్‌ ఇచ్చిన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి సూచించారు.

క్షేత్రస్థాయిలో పరిశీనలు చేసి వాటిపై చర్యలు తీసుకోవాలని... ఈ నివేదికలను పబ్లిక్‌ డొమైన్‌లోకి పెట్టాలని సీఎం సూచించారు. రెడ్, ఆరెంజ్‌ జాబితాలో ఉన్న కంపెనీలపై నిరంతర పర్యవేక్షణ వుంచాలని... వీటినుంచి ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు నిరంతరం రియల్‌టైం డేటా అందేలా చూడాలన్నారు.  అయితే వస్తున్న డేటాను విస్మరించడం అనేది మన వ్యవస్థల్లో ఉన్న పెద్ద లోపం అని...ఆ డేటా ఆధారంగా ఏం చర్యలు తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమన్నారు ముఖ్యమంత్రి.

read more   ఎల్జీ పాలీమర్స్‌కు కాంగ్రెస్, వైసీపీ అనుమతులు, ఇవిగో ఆధారాలు: జగన్ కు బాబు సవాల్

రసాయనాల నిర్వహణ, నిల్వ, ప్రాససింగ్, ప్రమాదకర రసాయనాలు.. తదితర అంశాలపై ఎప్పటికప్పుడు డేటాను ఏపీపీసీబీ స్వీకరించనున్నట్లు తెలిపారు.  దీంతోపాటు ప్రఖ్యాత, విశ్వసనీయ సంస్థకూ ఈ డేటా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నట్లు... దీని ద్వారా నిరంతర పర్యవేక్షణతో ఎప్పటికప్పుడు చర్యలు సాధ్యమన్నారు. ఈ డేటా ఎప్పటికప్పుడు రికార్డు చేయనున్నట్లు... నిర్ణీత ప్రమాణాలను దాటి కాలుష్యకారక పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. ఈ హెచ్చరికలు ఎవరెవరికి వెళ్లాలన్న దానిపై ఒక ఎస్‌ఓపీ తయారు చేయాలని సీఎం సూచించారు.  స్థానికంగా ఉన్న కలెక్టర్, ఎస్పీలకు, సంబంధిత అధికారులకు వెంటనే హెచ్చరికలు పంపేలా చూడాలన్నారు. 

హెచ్చరికలు జారీకి దారితీసిన కార్యకలాపాలపై క్షేత్రస్థాయిలో నిర్ణీత కాలంలో తనిఖీలు చేశాక జరిమానాలు విధింపు వుంటుందన్నారు. పర్యావరణానికి జరిగిన హాని ప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు. నిర్ణీత సమయంలోగా దీన్ని జరిమానాలు చెల్లించకపోతే భారీగా పెంపు వుంటుందని... ఎంతలా అంటే ఈ జరిమానాలు షాక్‌ కొట్టేలా ఉండాలని సూచించారు. 

ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి చోటు లేకుండా చూడాలన్నారు సీఎం. మద్యం విషయంలో మనం తీసుకున్న నిర్ణయాలు, షాక్‌ కొట్టించే మద్యం రేట్లు కారణంగా మద్యం వినియోగం తగ్గిందన్న అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.  న్యాయ నిపుణులను ఇన్వాల్వ్‌ చేస్తూ చట్టాన్ని సమర్థవంతంగా తీసుకురావాలన్న సీఎం. కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుందని సీఎం తెలిపారు. 

read more  నేను రెడీ మీరు రెడీనా...డేట్ ఆండ్ టైం మీరే డిసైడ్ చేయండి: సాయిరెడ్డికి అయ్యన్న సవాల్

వ్యర్థాలు, కాలుష్య కారక పదార్థాలు, జలాలను పద్ధతి ప్రకారం నిర్వహించాల్సి ఉంటుందని, లేకపోతే భవిష్యత్తు తరాలకు ఇబ్బంది వస్తుందన్నారు. శాస్త్రీయ విధానాలతో కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుందని సీఎం తెలిపారు. ప్రభుత్వమే ఈపనులు చేస్తున్నందున కొంత మొత్తాన్ని కంపెనీలు చెల్లించేలా విధానం ఉండాలన్నారు. దీనికోసం ప్రత్యేక విభాగం ఉండాలని అధికారులకు జగన్ సూచించరు. 

జనాభా ఉన్న ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలు రాకుండా చూడాలన్నారు. జనావాస ప్రాంతాలకు నిర్ణీత దూరంలో ఉండాలని సీఎం ఆదేశించారు. గతంలో ఇలాంటి అంశాలపై సరైన ఆలోచనలు చేయలేదని... ఇప్పుడు ఈ అంశాలపై దృష్టిపెడుతున్నట్లు తెలిపారు. లేకపోతే భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 

క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌కుమార్‌ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్‌ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.