తాడిపత్రి రాజకీయం ఇంకా గరంగరంగానే వుంది. నాటి ఘటనకు సంబంధించి కేసుల నమోదు విషయంలో తాజాగా వివాదం చోటు చేసుకుంది. పెద్దారెడ్డి, ఆయన తనయుడు హర్షవర్థన్‌పై 3 కేసులు నమోదు చేశామని డీఎస్పీ చైతన్య తెలిపారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి లాయర్ సమాచారం మేరకు కేసులు నమోదు చేశామని డీఎస్పీ చెప్పారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీతో పాటు మరో 2 కేసులు నమోదు చేశామని చైతన్య వెల్లడించారు.

సీసీ కెమెరాల ఫుటేజ్‌లోని సమాచారాన్ని సీఎస్, డీజీపీ, డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ, సీఐలకు ఇచ్చానని జేసీ లాయర్ తెలిపారు. తాను ఫిర్యాదుదారుడిని కాదంటూ సీఐకి లేఖ రాశారు జేసీ లాయర్. 

Also Read:తాడిపత్రిలో రాళ్లదాడి: 22 మందిపై కేసులు.. జేసీ, కేతిరెడ్డి ఇళ్ల వద్ద భారీ భద్రత

కాగా, ఇసుక రవాణాకు సంబంధించి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ పెద్దారెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు .దీంతో వివాదం చెలరేగింది. మరోవైపు తాడిపత్రిలో పరిస్ధితి అదుపులోనే వుందన్నారు డీఎస్పీ.

ప్రస్తుతం 144 సెక్షన్, 30 యాక్ట్ కొనసాగుతోందని చెప్పారు. కాశీ, బ్రహ్మయ్య, మనోజ్ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు 22 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 

ఆడియో టేపుల పోస్టింగ్‌లో వలీ అనే యువకుడితో పాటు మరో ఇద్దరు యువకులపై సుమోటాగా కేసు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భద్రత పెంచారు పోలీసులు.