రాయలసీమ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త. రాయలసీమలో మరికొద్ది రోజుల్లో మరో ఎయిర్ పోర్టు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. 

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో సోమవారం ట్రయల్ రన్ చేయగా.. అది విజయవంతమైంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది.

జనవరి 7 నుంచి ఈ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జనవరి 7న ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్టు రాయలసీమలో నాలుగో ఎయిర్‌పోర్టుగా రికార్డులకెక్కనుంది.
 
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌ కేంద్రంగా ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలు రావాలంటే రవాణా మెరుగుపడాలని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 999.50 ఎకరాలను ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అధారిటీకి కేటాయించింది. రూ.90.5 కోట్లతో 2017 జూన్‌లో పనులు చేపట్టారు. కీలకమైన రన్‌వే, అప్రాన్‌, టర్మినల్‌, టవర్‌ భవనం, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి.