నెల్లూరు: నెల్లూరులోని టూరిజం కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్ భాస్కర్ కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణిపై రాడ్ తో విచక్షణ రహితంగా కొట్టాడు. మాస్కు ధరించమని చెప్పినందుకు వికలాంగురాలు అని కూడ చూడకుండా ఆమెపై దాడికి దిగాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్న టూరిజం కార్యాలయంలో  కాంట్రాక్టు ఉద్యోగిగా ఉషారాణి పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో మాస్కు ధరించాలని ఆమె అసిస్టెంట్ మేనేజర్ భాస్కర్ ను కోరారు. 

తనను మాస్కు ధరించాలని కోరుతావా అని ఆగ్రహంతో భాస్కర్ ఉషారాణి టేబుల్ వద్దకు వచ్చి ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. అంతేకాదు ఆమెను కుర్చీ నుండి కింద పడేసి రాడ్ తో విపరీతంగా కొట్టాడు.

ఉషారాణిపై దాడిని తోటి ఉద్యోగులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో ఓ ఉద్యోగి కిందపడిపోయాడు. మరో ఉద్యోగి భాస్కర్ చేతిలోని రాడ్ ను లాక్కొన్నాడు. ఉషారాణిపై భాస్కర్ దాడి చేయడాన్ని చూడలేక ఓ మహిళ ఉద్యోగి అక్కడి నుండి భయంతో పరుగులు తీసింది. 

బాధితురాలు ఈ విషయమై నెల్లూరు నాలుగవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొంతకాలంగా ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినులపై వేధింపులకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి.