శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో యూనిఫాం కోసం మహిళా పోలీసుల శరీర కొలతలు పురుషులు తీసుకోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ విషయం తెలిసి జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు.
నెల్లూరు: యూనిఫాం కోసం మహిళా పోలీసుల శరీర కొలతలను పురుషులు తీసుకోవడం నెల్లూరు జిల్లా (nellore district)లో తీవ్ర దుమారం రేపుతోంది. మహిళా పోలీసులకు అసౌకర్యం కలిగించేలా జెంట్స్ టెయిలర్స్ కొలతలు తీసుకుంటున్న ఫోటోలు బయటకు రావడంతో తీవ్ర వివాదం మొదలయ్యింది. మహిళల ఆత్మగౌరవానికి ఇది భంగం కలిగించేలా వుందంటూ మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో నెల్లూరు జిల్లా ఎస్పీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
టైలర్ మెజర్ మెంట్స్ తీసుకునే ఇంచార్జ్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) వెంకటరత్నం ఆధ్వర్యంలో ఉమెన్ టైలర్స్, ఇతర మహిళా సిబ్బంది సహాయంతో మహిళా పోలీసుల కొలతలను తీసుకునే ఏర్పాటు చేసారు.
Video
మహిళా పోలీసుల యూనిఫాం కొలతలు పురుషులు తీసుకుంటున్నట్లు తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. వెంటనే మహిళా పోలీసుల యూనిఫాం కుట్టేందుకు మహిళా టైలర్స్ నే నియమించాలని ఎస్పీ ఆదేశించారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహిళా పోలీసుల మెజర్ మెంట్స్ తీసుకునే సమయంలో ఎవరికీ అసౌకర్యం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మహిళల రక్షణ, వారి గౌరవం పెంచడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని అన్నారు. పోలీస్ వ్యవస్థ జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఎస్పీ సూచించారు.
ఇక మహిళా పోలీసుల యూనిఫామ్ కోసం శరీర కొలతలు పురుష టైలర్స్ తీసుకున్న ఘటనపై మహిళా కమీషన్ కూడా స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలపై మహిళా కమిషన్ ఆరా తీసింది. పురుష టైలర్ ను మహిళా పోలీసుల యూనిఫామ్ కొలతల కోసం వినియోగించడంపై నెల్లూరు ఎస్పీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరక్కుండా చూస్తామని ఎస్పీ మహిళా కమీషన్ కు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పందించారు. నెల్లూరు పోలీస్ అధికారులకు మహిళలంటే అంత చులకనా? అని నిలదీసారు. నెల్లూరు పోలీస్ గ్రౌండ్ లో మహిళా పోలీసు యూనిఫామ్ కొలతలు తీసేందుకు మగ పోలీసులను వినియోగించటం దేనికి సంకేతని రామకృష్ణ ప్రశ్నించారు.
నెల్లూరు ఎస్పీ కూడా ఈ వ్యవహారాన్ని సమర్థిస్తూ ఇందులో తప్పేముంది అన్నట్లు మాట్లాడినట్లు తెలిసిందన్నారు. పరిశీలనకు వెళ్లిన యువజన నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు.
సాక్షాత్తు రక్షకభటులే అసభ్యానికి ఆజ్యం పోస్తుంటే సభ్య సమాజంలో మహిళలకు రక్షణేదీ? అని ప్రశ్నించారు. మహిళా పోలీసుల పట్ల నెల్లూరు జిల్లా పోలీసు అధికారుల వైఖరిని తప్పుబట్టారు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ.
ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఘటనపై స్పందించింది. మహిళా పోలీసుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఇలాంటి సంఘటనపై మహిళా హోంమంత్రి స్పందించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గౌరవప్రదమైన పోలీస్ వృత్తిలో వున్న మహిళల పరిస్థితే ఇలా వుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.
