నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి భార్య వివాదంలో చిక్కుకున్నారు. ఆమె తన ఇంట్లో అంగర్ వాడీ వర్కర్లతో పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఉద్యోగం ఇచ్చినందుకు గాను రూ. మూడున్నర లక్షలు ఇవ్వాలని జేసీ భార్య శ్రీలక్ష్మి డిమాండ్ చేశారని రెహానా అనే అంగన్ వాడి కార్యకర్త నెల్లూరు 5వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

విషయం తెలుసుకున్న ముస్లిం, దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఫిర్యాదులో జేసీ భార్య పేరులేదని సీఐ చెబుతుండగా... ఫిర్యాదును పోలీసులు మార్చేశారని ముస్లిం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఉద్యోగం ఇచ్చినందుకు మూడున్నర లక్షలు డిమాండ్ చేశారని, దీనిలో భాగంగా రూ. 2 లక్షలు ఇచ్చానని రెహానా చెప్పారు. మిగిలిన లక్షన్నర ఇవ్వకపోవడంతో తమ ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

జేసీ భార్య లక్షన్నర చోరీ అయినట్లు ఫిర్యాదు ఇచ్చారని చెబుతున్న పోలీసులు.. జేసీ ఇంట్లో అంత డబ్బు ఎందుకు ఉందనే దానిపై దర్యాప్తు ఎందుకు చేయడంలేదని ముస్లిం నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంతగా అవినీతికి పాల్పడతున్నారో తెలుస్తోందని వారు ఆరోపించారు.