నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు
కరోనాతో ప్రజలు అల్లాడుతున్న వేళ.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని తీసుకున్న వారిలో సత్ఫలితాలు వస్తున్నాయంటూ ప్రచారం జరగడంతో జనం భారీగా వాహనాల్లో తరలివచ్చారు.
దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం ఆయుర్వేద ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని ఆయన వెల్లడించారు. దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే... ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని చక్రధర్ బాబు తెలిపారు.
Also Read:ఏపీలో ఆగని మరణమృదంగం: కొత్తగా 20,937 కేసులు.. పోటీపడుతున్న చిత్తూరు, తూ.గో
అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు కృష్ణపట్నం చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయుష్ కమీషనర్ మాట్లాడుతూ... శాస్త్రీయంగా బొనిగి ఆనందయ్య మందుని అన్ని విధాలుగా పరిశీలిస్తామన్నారు. మందుకి చట్టబద్ధత కల్పిసే ఎక్కువ మందికి మందు కల్పించే అవకాశం ఉందన్నారు.
నివేదికని త్వరితగతిన పంపడం జరుగుతుందన్నారు. రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆయుష్ కమిషనర్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స కూడా కష్టంగా మారింది. ఆక్సిజన్ అందక అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ‘కృష్ణపట్నం ఆయుర్వేద మందు’ కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. అయితే శాస్త్రీయంగా రుజువు కాలేదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం మందు శాంపిల్స్‌ను ఆయుష్ ల్యాబ్‌కు పంపింది.
