లోకేశుడి కాలంలో  టిడిపిలో చేరి తప్పుచేశామా అనే సంశయం అనం బ్రదర్స్ లో మొదలయిందని  చెబుతున్నారు.

ఆ మధ్య తెలుగుదేశంలోకి ఫిరాయించిన నెల్లూరు జిల్లా పెద్ద రెడ్లయిన ఆనం వివేకానంద రెడ్డి, రామనారాయణ్ రెడ్డిల హడావిడి అంతా ఇంత కాదు.

తెలుగుదేశం పార్టీని మోస్తున్నది వీరద్దరేనా అనే అనుమానం వచ్చేలా ప్రకటనలు, ఖండనలు, సవాళ్లు .. అబ్బో ఎంత సందడో.

జగన్ ఏమ్మాట్లాడినా మొదట రియాక్షన్ వివేకానందరెడ్డి దగ్గిర నుంచే వచ్చేది. జగన్ మీద అంతకొపమెందుకో అర్థమయి చావదు. ఇది కోపమా, లేక కొత్తగా తమకు నాయకుడయిన చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకునేందకు కొరడాతో కొట్టుకోవడమా ?

బాగానే నడిచింది కొంతకాలం. ఏమయిందో ఏమో గత కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీలో వినిపించని గొంతులివే. ఈ మౌనం రకరకాల రాజకీయానుమానాలకు తావిస్తున్నది. తెలుగుదేశం పార్టీలో వస్తున్న తాజా పరిణామం వీరికి ఇబ్బంది కలిగిస్తున్నట్లు జిల్లాలో అనుకుంటున్నారు. 

రాజకీయాలలో దాదాపు సమకాలీనుడయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో వారికి పెద్దగా సమస్య లేదు. అయితే, ఇపుడు మెల్లిగా ప్రభుత్వం, పార్టీ రెండు చిన్నబాబు చేతిలోకి మారిపోతున్నాయి. అందువల్ల చిన్నబాబుకు దండంపెట్టడం,ఆయన సమావేశాలకు హాజరుకావడం, జనం తోలడం, అపుడపుడు చప్పట్లు కొట్టడం, బాబు గారూ మీరు బాగా మాట్లాడారని అంటూవుండటం... వీరు చేయాల్సిన జాబితాలో ఉన్న పనులు. ఇక్కడే వాళ్లకి ఇబ్బంది మొదలయిందని ప్రచారం. దానికితోడు చిన్నబాబు సీనియర్ సిటిజన్లను పక్కన పెట్టి తనకు అనుకూలంగా ఉన్న వారితో జతగడుతూ, ప్రోత్సహిస్తూండటం వారికి ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు.

టిడిపిలో చేరి తప్పుచేశామనే అనే అనుమానం కూడా వీరిలో మొదలయిందని సన్నిహితులు చెబుతున్నారు.

చాలా కాలం జిల్లాను శాసించినందువల్ల తెలుగుదేశం పార్టీలో చేరాక అదే వైభోవం కొనసాగుతుందని భావించి, కంగుతిన్నారని వారు చెబుతున్నారు.

ఈ మధ్య వివేకానందరెడ్డికి ఒక తెలుగుదేశం నాయకుడికి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ బాగా ప్రచారంలో ఉంది జిల్లాలో.

కొద్ది రోజుల కిందట నెల్లూరు టిడిపి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది.‘సర్, నమస్కారం. తెలుగుదేశం ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నాం. ఈరోజు నారా లోకేశ్ నాయుడు పర్యటనకు వచ్చారు. మిమ్మల్ని ప్రత్యేకాహ్వానితులుగా రమ్మంటున్నారు. వెంటనే రావాలంట..’ అని ఎవరో ఆగంతకుడు ఆహ్వానించాడు.

అంతే, ఇవతలి వ్యక్తి కి వొల్లు మండింది.

‘ఏంవోయి తమాషాగా ఉందా. ఇదే నా పిల్చే పద్ధతి. ఇదే కాంగ్రెస్ అయి ఉంటే,మిమ్మల్నందరిని బజారుకీడ్చేవాణ్ని. నేను లోకేశ్ ప్రోగ్రాంకు రాను గాక రాను . ఈ మాటే చెప్పేశేయ్. చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేస్తా. ఫోన్ పెట్టేశేయ్,’ అని గాండ్రించేసరికి అవతలి హడలిపోయి కిమ్మనకుండా ఫోన్ పెట్టేశాడు. 

ఇవతలి మనిషెవరో కాదు, అనం వివేకానందరెడ్డి.

అసలే లోకేష్ పిల్లోడు. ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి సరిపోయింది. అయినా టూర్ ఉంటే ప్రోగ్రాం ముందే పంపించాలి. పిలవాలి. సీనియర్ అనే గౌరవం కూడా చూపకుండా ఉన్నఫలానా రమ్మనారు. దీనితో ఆయనకు మండింది.

ఇక ముందు ముందు ఇలాంటివి ఎక్కువవుతాయని ఆయన అనుమానిస్తున్నట్లున్నారు.

ఇలా తనని అవమానించినందుకు స్వభావ రీత్యా లోకేశ్ కు తలంటాలి. అయితే, ఆయన సిఎం కొడుకు, కాబోయే సిఎం అని పార్టీలో నమ్ముతున్నారు.

తెలుగుదేశం పార్టీలో చేరాక, చంద్రబాబు నాయుడు ఇప్పటికే వారిని నియోజకవర్గాలకు పరిమితం చేశారు. లోకేశ్ ను ముట్టుకుంటే...

లోకేశ్ కార్యక్రమానికి రామ్ నారాయణ్ రెడ్డి హాజరయ్యారు. వివేకా డుమ్మా కొట్టారు.

ఇది ఎటువైపు దారితీస్తుందో అర్థం కావడం లేదు. కుమారుల కోసం భవిష్యత్తు కోసం వీటినిభరించడమా లేక మరొకదారి చూసుకోవడమా? ఇదే ఇపుడు ఆనం అభిమానుల వేధిస్తున్న ప్రశ్న.