అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేంద్ర రాష్ట్ర సంబంధాల బాధ్యతను అప్పగించే అవకాశం ఉదని తెలుస్తోంది. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యే అవకాశం ఉంది. 

సీనియర్ ఐఎఎస్ అధికారి నీలం సాహ్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళ. ఆమె 1984వ బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమెను జగన్ ప్రత్యేక విజ్ఞప్తి ద్వారా రాష్ట్రానికి బదిలీ చేయించుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఆమెది తొలి నియామకం. ఆమె ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు.  నిజానికి, ఆమె పదవీ కాలం మే 30వ తేదీన ముగియాల్సి ఉంది. కానీ ఆమె పదవీ కాలాన్ని కూడా జగన్ ప్రభుత్వం పొడగించింది. డిసెంబర్ 31వ తేదీన ఆమె పదవీకాలం పూర్తవుతుంది.