నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావుతో పాటు ఆయన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ గురువారం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇదే సమయంలో మరో నేత వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. 

నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వచ్చే ఆగస్టు నెలలో వైసిపిలో చేరనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను వెంటగిరి నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. బుధవారం జరిగిన మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి నాల్గవ వర్ధంతి సభలో ఆయన ఆ విషయం చెప్పారు. రాంకుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి కుమారుడు.

నేదురుమల్లి అభిమానుల అభిప్రాయాలు తెలుసుకుని 2019 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి చేస్తాననో ఆగస్టులో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడుతుండగా మధ్యలో ఓ అభిమాని మన పార్టీ వైఎస్ఆర్ సిపి అని గట్టిగా అరిచాడు. దానికి ఆయన స్పందిస్తూ మరో మూడు నెలలు మీ అభిప్రాయాలను మనసులోనే ఉంచుకోవాలని సూచించారు. 

మీ అందరి మనస్సులో ఏ పార్టీ అనుకుంటున్నారో అదే పార్టీ నుంచి వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. గత నెలలో గూడూరు వైసిపి సమన్వయకర్త మేరిగ మురళీధర్ రాంకుమార్ రెడ్డిని కలిసి చర్చించారు. ప్రస్తుత ప్రసంగాన్ని, ఆ భేటీని బట్టి చూస్తే రాంకుమార్ రెడ్డి వైసిపిలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు.