విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించడంతో విశాఖపట్నం శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో పలువురు ఆయనను ఆశ్రయిస్తున్నారు. గతంలో ఆయనతో ఏ విధమైన సంబంధాలు లేనివారు కూడా ఇప్పుడు ఆయన దర్శనం కోసం వస్తున్నారు. 

రాష్ట్రంలో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ స్వరూపానంద దర్శనం చేసుకున్నారు. నవయుగ గ్రూప్ చైర్మన్ విశ్వేశ్వర రావు రెండు రోజుల క్రితం ఆయనను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన శారదాపీఠాధిపతిని దర్శించుకున్న దాఖలాలు లేవు. ఈ భేటీపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలోనే ఆయన స్వరూపానందేంద్రను కలిసి ఉంటారని ప్రచారం సాగుతోంది.

కేంద్రంతో సంబంధం సంబంధం లేకుండా పోలవరం ప్రాజెక్టును తామే నిర్మిస్తున్నట్లు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గతంలో ప్రకటించారు. అయితే, పోలవరం ప్రాజెక్టులో పెద్ద యెత్తున అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసిపి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి విమర్శించాయి. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2010-11లో రూ. 12,294 కోట్లు మంజూరయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో నిర్మాణ వ్యయాన్ని రూ.55,549 కోట్లకు పెంచేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు ససేమిరా చెప్పింది. 

కేంద్రం అభ్యంతరాలను లెక్క చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులను నవయుగ కన్ స్ట్రక్షన్స్ కు అప్పగించింది. ఎన్నికల సమయంలో కూడా 10 వేల కోట్ల రూపాయలను విడుదలు చేసింది. ఆ తర్వాత మరో 2500 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 

చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడంతో నవయుగ గ్రూప్ చైర్మన్ శారదాపీఠాధిపతిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.  స్వరూపానందేంద్ర స్వామి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడనే విషయం బహిరంగ రహస్యమే. జగన్ ప్రమాణస్వీకారానికి ఆయనే ముహూర్తం పెట్టారు. 

పైగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కూడా ఆయన సన్నిహితులు. ఆయన చేత కేసీఆర్ రాజశ్యామల యాగం చేయించారు. కేసీఆర్ కు, జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్న విషయం కూడా తెలిసిందే.