నవయుగ కంపెనీ చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులను కాంట్రాక్టు సంస్ధ ట్రాన్స్ స్ట్రాయ్ చేయలేకపోతోంది. అంచనా వ్యయాలను పెంచితే తప్ప పనులు పూర్తికావని ఇంతకాలం చంద్రబాబు చెబుతున్న విషయమూ అందరికీ తెలిసిందే. ట్రాన్స్ స్ట్రాయ్, చంద్రబాబు చెబుతున్న పనులనే, అంచనా వ్యయాలు పెంచకుండానే పాత ధరలకే చేస్తామంటూ నవయుగ నిర్మాణ సంస్ధ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద షాక్ కొట్టినట్టైంది. ఇంతకాలం తాము చెబుతున్న మాటలకు, జరుగుతున్న పనులకు నవయుగ ప్రతిపాదనలు పూర్తి విరుద్దంగా ఉండటంతో ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావటం లేదు.

ట్రాన్స్ స్ట్రాయ్ తో ప్రభుత్వం గతంలో చేసుకున్న ధరలకే తాము పోలవరం పనులను పూర్తి చేస్తామని నవయుగ చెప్పటం గమనార్హం. పాత ధరలకే పనులు చేయటానికి నవయుగ సంస్ధ ముందుకు వచ్చినపుడు అవే పనులు ట్రాన్ట్ స్ట్రాయ్ ఎందుకు చేయలేకపోతోందన్న విషయంపై సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి. పైగా తాము లాభాలను ఆశించకుండానే పనులను పూర్తి చేస్తామని నవయుగ చెప్పింది. అంటే, ఇంతకాలం ట్రాన్ట్ స్ట్రాయ్ చేసిందేమిటి అన్నది పెద్ద ప్రశ్న.

ట్రాన్స్ స్ట్రాయ్ పనులు చేయలేక చేతెలెత్తేసిన స్పిల్ వే, స్పిల్ వే ఛానల్ పనులు, మట్టి పనులను అంచనాలలో ఎటువంటి పెంపు లేకపోయినా తాము చేస్తామని నవయుగ కంపెనీ ముందుకు రావటమంటేనే చంద్రబాబు చిత్తశుద్దిపైన అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ నవయుగ ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరిస్తే వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందనటంలో సందేహం అవసరం లేదు. మరి, అందుకు చంద్రబాబు ప్రభుత్వం అంగీకరిస్తుందా? చూడాల్సిందే ఏం జరుగుతుందో.