ప్రత్యేకహోదా సాధన కోసం అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న జాతీయ రహదారుల దిగ్బంధం విజయవంతంగా, ప్రశాంతంగా జరుగుతోంది. గురువారం ఉదయం నుండే వైసిపి, టిడిపి నేతలతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన శ్రేణులు రోడ్లపైకి చేరుకున్నాయి. వివిధ పార్టీల కార్యకర్తలందరూ ఎక్కడికక్కడ వలయాలుగా ఏర్పడి సాంఘీభావంతో రహదారులను దిగ్బంధం చేశారు.

ప్రత్యేకహోదా కావాలని, విభజన హామీలను వెంటనే అమలు చేయాలంటూ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు, కార్యకర్తల నినాదాలతో రోడ్లు మారుమోగిపోయింది. విశాఖపట్నంలో ప్రత్యేకరైల్వే జోన్ డిమాండ్ తో రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి.

రహదారి 16పై నేతలు, కార్యకర్తలు కూర్చునేశారు. అలాగే, బెంగుళూరు-అనంతపురం జాతీయ రహదారిపైన కూడా వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపైన కూడా వాహనాలు తిరగకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. చెన్నై-కోల్ కత్తా జాతీయ రహదారిపై రామవరప్పాడు దగ్గర టిడిపి నేత అవినాష్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది.

రాష్ట్రంలో పరిస్ధితిని చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. అదే సమయంలో గుంటూరు సమీపంలోని అంకిరెడ్డిపాలెం రహదారి వద్ద జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికారు. మొత్తం మీద అధికార-ప్రతిపక్షాలు ఏకమై చేస్తున్న ఆందోళన బహుశా ఇదే మొదటిదేమో.

అందుకనే పోలీసులు కూడా ఆందోళనల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే శాంతి, భద్రతల సమస్యలు రాకుండా మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.