పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడంలేదని... పర్యావరణ ప్రణాళికలను లోపభూయిష్టంగా రూపొందించారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆరోపించింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరంపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడంలేదని... పర్యావరణ ప్రణాళికలను లోపభూయిష్టంగా రూపొందించారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆరోపించింది. దీంతో ఈ నిర్మాణ పనులను పరిశీలించేందుకు హైకోర్టు రిటైర్ జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని నియమించనున్నట్లు ఎన్జీటీ వెల్లడించారు. ఈ కమిటీలో హైకోర్ట్ రిటైర్డ్ జడ్జితో పాటు ఐఐటీ, ఐఐఎస్‍ఆర్ నిపుణులు కూడా వుంటారని ప్రకటించింది.
ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష జరిపారు. ఈ క్రమంలోనే తొలివిడత ప్రాధాన్యతా ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. నిర్ణీత లక్ష్యంలోగా ప్రాజెక్టులు పూర్తవ్వాలని జగన్ సూచించారు. కాఫర్ డ్యాం వల్ల ముంపునకు గురికాకుండా చూడాలని.. సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వెల్లడించారు.
read more పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం కోసం పిల్: నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు
నిర్ణీత ప్రణాళిక మేరకు ఆర్అండ్‌ఆర్ పనులను చేపట్టాలని జగన్ పేర్కొన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపైనా జగన్ సమీక్షించారు. ఈ ఏడాది జూన్ నాటికి వంశధార-నాగావళి అనుసంధాన పనులు, జులై నాటికి వంశధార పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
వీటితో పాటు రెండో విడత ప్రాధాన్యతా ప్రాజెక్టుల కార్యాచరణ సిద్ధం చేయాలని.. అందులో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై దృష్టి సారించాలని జగన్ అధికారులను ఆదేశించారు. రాయలసీమ, పల్నాడు ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలతో అంగీకారం కుదిరిందని.. మిగిలిన ప్రాజెక్టుల నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
