గుంటూరు జిన్నా టవర్ పై నేడు జాతీయ జెండా ఎగురవేయడానికి  అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ టవర్ కు బుధవారం నాటికి త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు వేయడం పూర్తయ్యింది. నేడు అధికారుల, స్థానికులు ప్రజాప్రతినిధుల సమక్షంలో జెండా ఎగురవేసి వేడుక నిర్వహించనున్నారు. 

జిన్నా ట‌వ‌ర్ పై కొంత కాలంగా నెల‌కొన్న‌ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఏపీ ప్ర‌భుత్వం, స్థానిక అధికారులు చాలా వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రించారు. గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్ కు బుధ‌వారం త్రివ‌ర్ణ ప‌తాకంలోని మూడు రంగులు వేశారు. ఆ ట‌వ‌ర్ ను ఎవ్వ‌రూ ఏం చేయ‌కుండా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ప్ర‌త్యేకంగా దీని కోసం నిధులు కేటాయించి సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఇప్పుడు సుంద‌రంగా త‌యారైంది. నేడు ఆ ట‌వర్ పై జాతీయ జెండా ఎగుర‌వేసి వేడుక నిర్వ‌హించ‌నున్నారు. దీంతో ఈ ట‌వ‌ర్ స‌మ‌స్య‌కు దాదాపు ముగిసిన‌ట్టుగానే భావించాలి. 

ఏమిటీ ఈ జిన్నా ట‌వ‌ర్ ? ఎందుకు ఆ వివాదం ? 
భార‌త దేశానికి స్వ‌తంత్రం రాక ముందు మ‌హమ్మ‌ద్ అలీ జిన్నా ఏపీలోని గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించాల‌ని అనుకున్నాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప‌ర్య‌ట‌న క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఆయ‌న‌కు గుర్తుగా అప్ప‌టి నాయ‌కులు ఓ నిర్మాణం ఏర్పాటు చేసి దానికి జిన్నా ట‌వ‌ర్ అని నామ‌క‌ర‌ణం చేశారు. అప్ప‌టి నుంచి ఆ ట‌వ‌ర్ అలాగే ఉంది. అయితే కొన్ని రోజులుగా ఈ ట‌వ‌ర్ వివాదంలో నిలుస్తోంది. 

దేశ విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన మ‌హమ్మ‌ద్ అలీ జిన్నా పేరుతో ఓ క‌ట్ట‌డం ఎందుకని బీజేపీ నేత‌లు చాలా రోజులుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆ నిర్మాణానికి పేరు మార్చాల‌ని డిమాండ్ చేస్తున్నారు. జిన్నా ట‌వ‌ర్ కు దివంగ‌త రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం పేరు పెట్టాల‌ని సూచిస్తున్నారు. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం నాడు హిందూ వాహినికి చెందిన కొంతమంది నాయ‌కులు జిన్నా టవర్ వ‌ద్ద‌కు చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ స‌మ‌యంలో కొంత వివాదం చెల‌రేగింది. పోలీసులు అక్క‌డికి చేరుకొని ముగ్గురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాల‌ని కొంత కాలంగా ప్ర‌భుత్వం యంత్రాంగం ఆలోచిస్తోంది. ఈ క్ర‌మంలో ఓ తెలివైన నిర్ణ‌యం తీసుకొని స‌మ‌స్య‌ను చాక‌చ‌క్యంగా ప‌రిష్క‌రించాల‌ని భావించారు. అందులో భాగంగానే ఆ ప్రాంతాన్ని సుంద‌రీక‌రించేందుకు నిధులు కేటాయించుకొని జిన్నా ట‌వ‌ర్ చుట్టూ పెన్సింగ్ నిర్మించి గ్రీన‌రీ ఏర్పాటు చేశారు. ఆ ట‌వ‌ర్ కు జాతీయ జెండాలోని మూడు రంగులు వేశారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం అందంగా ముస్తాబైంది. నేడు ఈ ట‌వ‌ర్ పై త్రివ‌ర్ణ ప‌తాకం ఎగురవేయ‌బోతున్నారు. దీని కోసం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, ఎం. గిరిధర్‌తో సహా ముస్లిం నేతలతో సమావేశం నిర్వహించి టవర్‌కు త్రివర్ణ పతాకం వేయాల్సిన అవసరం ఉందని అధికారులు వారిని ఒప్పించారు.

అయితే బీజేపీ డిమాండ్ చేసిన‌ట్టు జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చ‌బోమ‌ని గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, ఎమ్మెల్సీ ఎల్‌ అప్పిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ‘‘ ఈ టవర్ స్వాతంత్రానికి పూర్వం నాటిది. ఇది న‌గ‌రంలోని హిందూ-ముస్లిం మ‌త సామ‌ర‌స్యానికి, ఐక్య‌త‌కు చిహ్నంగా ఉంది’’ అని వారు చెప్పారు.