ఉత్తరాంధ్రలోని మరో కీలక నియోజకవర్గం నర్సీపట్నం. ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట... కానీ 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసిపి గెలిచింది. ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఈ నియోజకవర్గానికి చెందినవారే. ఈసారి కూడా వీరిద్దరే పోటీ చేస్తుండటంతో నర్సీపట్నం పోరు రసవత్తరంగా వుంది.  

నర్సీపట్నం నియోజకవర్గ రాజకీయాలు :

నర్సీపట్నం నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టువుంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇక్కడినుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మొదట 1983 లో నర్సీపట్నం బరిలో నిలిచి గెలిచిన అయ్యన్న ఆ తర్వాత 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు నాయుడు కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేసారు. 

ఇక పెట్ల ఉమాశంకర్ గణేష్ గ్రామస్థాయి అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సొంత సోదరుడే ఉమాశంకర్. ఇద్దర సోదరులు సినిమారంగంలో వున్నా ఉమాశంకర్ మాత్రం రాజకీయాలవైపు అడుగులేసారు. ఆయన 2014 ఎన్నికల్లో అయ్యన్న చేతిలో ఓడినా 2019 లో మాత్రం విజయం సాధించారు.


నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :

1. నాతవరం
2. గొలుగొండ
3. నర్సీపట్నం
4. మాకవరపాలెం 

నర్సీపట్నం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,10,578
పురుషులు - 1,02,719
మహిళలు ‌- 1,07,842

నర్సీపట్నం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

మరోసారి నర్సీపట్నం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపిలో బలమైన నేతగా వున్న అయ్యన్నను ఓడించారు ఉమాశంకర్. దీంతో మళ్ళీ అయ్యన్న ఓడించగలడన్న నమ్మకంతో ఉమాశంకర్ ను పోటీ చేయిస్తున్నారు వైఎస్ జగన్. 

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి నర్సీపట్నం బరిలో నిలిచారు. ఇప్పటికే ఆరుసార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న ఏడోసారి పోటీ పడుతున్నారు. 

నర్సీపట్నం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

నర్సీపట్నం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,74,330 (82 శాతం)

వైసిపి - ఉమాశంకర్ గణేష్ - 93,818 ఓట్లు (54 శాతం) - 23,366 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - చింతకాయల అయ్యన్నపాత్రుడు - 70,452 ఓట్లు (40 శాతం) - ఓటమి

నర్సీపట్నం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,63,181 ఓట్లు (82 శాతం)

టిడిపి - చింతకాయల అయ్యన్నపాత్రుడు - 79,726 (48 శాతం) - 2,338 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - ఉమాశంకర్ గణేష్ - 77,388 (47 శాతం) - ఓటమి