న్యూఢిల్లీ: తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. 

రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణలను ఏపీ ఇంటలిజెన్స్ అదికారులు ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన ఫోన్ల నుండి చేసే ఫోన్ కాల్స్ ను చట్ట విరుద్దంగా అధికారులు ట్యాప్ చేస్తున్నారని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. 

గత కొంతకాలంగా తాను ఉపయోగించే ఫోన్లకు తరచూ అంతరాయం ఏర్పడుతోందని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.వైఎస్ రెడ్డి అనే వ్యక్తి తనను చంపుతానని బెదిరింపులకు దిగాడని కూడ ఆయన ఫిర్యాదు చేశారు.తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నవారితో పాటు బెదిరింపులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరించినందున అనర్హత వేటు వేయాలని కోరుతూ వేసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు.