ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. న్యూఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జగన్‌పై తనకు గతంలో ప్రేమ ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

కానీ ఇప్పుడు ఆయనపై ప్రేమ తగ్గిపోయిందని రఘురామ పేర్కొన్నారు. అలవాటులో పొరపాటుగా ప్రియతమ ముఖ్యమంత్రి అని వచ్చేస్తోందంటూ సెటైర్లు వేశారు. పిచ్చి కేసులు పెట్టి దొరికిపోవడం, ఆ తర్వాత ప్రజల్లో అల్లరైపోవడం తమ పార్టీ నేతలకి అలవాటైందంటూ చురకలు వేశారు.

ఇక నుంచి అయినా ఇవి తగ్గించుకుంటారని భావిస్తున్నానని, ఆయనపై ఉన్న గౌరవంతోనే తాను ఈ మాటలు చెబుతున్నానని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఎన్ని స్కీములు చేసినా నెల రోజులు చేయగలరని, తర్వాతైనా కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ సీఎం జగన్ కేసులను ఉద్దేశిస్తూ ఆయన అన్నారు. 

మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజుపై మండిపడ్డారు ఆయన పార్టీకే చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. ఆంధ్రా పరువు తీసేలా రఘురామ ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు, శరం ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకులకు రఘురామ రూ.900 కోట్లు ఎగనామం పెట్టారని ఎంపీ రెడ్డప్ప చెప్పారు.