అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పంథాను ఆయన అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంట్ ను ముందుకు తెచ్చారు. తెలంగాణకు వ్యతిరకంగా వ్యవహరించిన చంద్రబాబును తిరిగి ఎలా అంగీకరిస్తారని ఆయన అడిగారు. అదే తరహాలో మోడీ చంద్రబాబుపై ఎన్టీఆర్ సెంటిమెంట్ ను ప్రయోగించబోతున్నారు. 

కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అయితే కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఎన్టీఆర్ మూలసిద్ధాంతాన్ని కాలరాస్తున్నారని మోడీ చెప్పడానికి సిద్ధపడ్డారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను తమ వైపు తిప్పుకుని చంద్రబాబుకు చిక్కులు కల్పించాలనే యోచనలో ఆయన అన్నారు. 

చంద్రబాబు నాయుడు 2017 వరకు కాంగ్రెసు పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సోనియా గాంధీని సోనియా గాడ్సేగా అభివర్ణించారు.  ఇటీవల మోడీ తమిళనాడు బిజెపి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. 

తెలంగాణలో కాంగ్రెసుతో కలిసి ప్రజా కూటమి కట్టిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దెబ్బ తిన్నది. దీంతో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిక్కుల్లో పడేయడానికి ఎన్టీఆర్ సెంటిమెంట్ అస్త్రం పనికి వస్తుందనే ఆలోచనలో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ సెంటిమెంట్ తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంది. దాంతో ఎన్టీఆర్ సెంటిమెంటును వాడుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. మోడీ వ్యాఖ్యలు దారుణమని చంద్రబాబు అన్నప్పటికీ ఆ సెంటిమెంటుతోనే ముందుకు వెళ్లాలని బిజెపి భావిస్తోంది.

అయితే, ఎన్టీఆర్ కాంగ్రెసుకు వ్యతిరేకంగా టీడీపిని స్థాపించారనే వాదనకు టీడీపి నేతలు విరుగుడు కనిపెట్టినట్లే కనిపిస్తున్నారు. కాంగ్రెసు అనేది కేంద్ర ఆధిపత్యానికి సంకేతమని, ఆ కాలంలో కాంగ్రెసు తప్ప మరో జాతీయ పార్టీ లేదని, కేంద్ర ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఉద్దేశంతో ఎన్టీఆర్ టీడీపిని స్థాపించారని వారంటున్నారు.