విజయవాడ: గుర్తింపులేని పాఠశాలలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. గుర్తింపు లేని పాఠశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. విజయవాడ, సత్యనారాయణపురంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. 

ఈ విషయమై యాజమాన్యానికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా వైఖరి మారకపోవడంతో సీజ్‌ చేసి, లక్ష రూపాయల జరిమానా విధించారు. వేసవి సెలవులు ముగించుకుని బుధవారం స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ స్థితిలో విద్యాశాఖ గుర్తింపు లేని పాఠశాల ఏరివేతకు చర్యలు చేపట్టింది.

ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్‌ వేయడంతో పాటు అర్హులైన పేదలందరినీ అమ్మ ఒడి ద్వారా ఆదుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే విద్యాశాఖలో సంస్కరణలు తేవడానికి రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.