గుంటూరు:  అంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోపభూయిస్టమైన ఇసుక విధానం కారణంగా మంగళగిరి ఎయిమ్స్  నిర్మాణంలో తీవ్ర జాప్యం, తద్వారా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రికి జగన్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యంగా  వివిధ జిల్లాల నుండి ఎయిమ్స్ కి వచ్చే రోగులు మరింతగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. 

''ఫిబ్రవరి 2న లోక్ సభ సమావేశాల సంధర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణంలో జాప్యానికి ఇసుక కొరతే కారణమని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే పార్లమెంటుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరా చెయ్యడం, డ్రైనేజీ, రహదారి నిర్మాణంతో పాటు ఎన్‌డీఆర్ఎఫ్ క్యాంపస్‌ను మార్చడం వంటి పనుల్లో అలసత్వం కారణంగా మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం ఆలస్యం అవుతోందని లోక్ సభలో సమాధానంగా చెప్పారు. కేంద్ర మంత్రి సమాధానంతో వైకాపా ఇసుక విధానం ఎంత చెత్తగా ఉందొ,నిర్మాణ రంగం పై ఎంత ప్రభావం ఉందొ మరోసారి బయటపడింది'' అని తన లేఖలో పేర్కొన్నారు. 

''పేదల ఆరోగ్య అవసరాలు తీర్చడంలో ఎయిమ్స్ దేశంలోనే కీలక పాత్ర పోషిస్తుంది. దక్షణ భారత దేశంలో రెండో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రానికి లభించిన మంచి అవకాశం. ఎయిమ్స్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చెయ్యడం వలన రోగులకు మేలు జరుగుతుంది. స్థానికంగా ఎంతో మందికి ఉపాధి,ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వైద్య విద్య అభ్యసిస్తున్న ఎంతో మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది'' అని గుర్తుచేశారు. 

''రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వలన ఎయిమ్స్ నిర్మాణం ఆలస్యం అవుతుంది.పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలు, అందుబాటులో ఇసుక లేకపోవడం ఎయిమ్స్ నిర్మాణానికి ఆటంకంగా మారాయి.కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకే ఇసుక సరఫరా కాకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు'' అని మండిపడ్డారు.

''కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమవవడంతోనే ఎయిమ్స్ నిర్మాణం నత్త నడకన సాగుతుంది. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి, అవాస్తవాలు ప్రచారం చెయ్యకుండా ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి'' అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.