గుంటూరు జిల్లా జైలు వద్ద విడుదలైన టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలకు లోకేశ్ స్వాగతం పలికారు.

గుంటూరు: ఉమ్మడి రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్న వైసిపి ఎంపీలు గాడిదలు కాస్తున్నారా? అని టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు.

 గుంటూరు జిల్లా జైలు వద్ద విడుదలైన టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... వైసిపి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సింహంలాగా బయటికి వచ్చారన్నారు. విద్యార్థుల హక్కులను ఈ ప్రభుత్వం కాలారాస్తోందని... వాటి గురించి ప్రశ్నించినందుకే టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేశారని ఆరోపించారు.

 రాష్ట్రాన్ని దోచుకొని జైలుకెళ్లిన వాడు బయటకు వచ్చేప్పుడు తలదించుకొని వస్తాడని, ప్రజల కోసం పోరాటం చేసి జైలుకెళ్లిన వాళ్ళు తలెత్తుకొని బయటకు వస్తారని జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు చూసారా?తల దించుకొని వచ్చాడు. కానీ మా టిఎన్ఎస్ఎఫ్ కుర్రాళ్లు ఎలా వచ్చారో చూసారుగా తలెత్తుకొని బయటకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఐపీసీ అమలు అవ్వడం లేదు... జేపిసి అమలు అవుతుందన్నారు. కొంత మంది పోలీసులు అత్యుత్సాహంతో జగన్ పీనల్ కోడ్ ను అమలు చేస్తున్నారంటూ పోలీసుల మీద విరుచుకుపడ్డారు.