ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా రీడర్స్ ని ఫూల్స్ చేయడానికి బిజెపిలో టిడిపి విలీనం అంటూ డెక్కన్ క్రానికల్ తప్పుడు వార్తను ప్రచురించింది.ఈ వార్త తెలుగుదేశం పార్టీ నాయకులకు కోపం తెప్పించింది.
అమరావతి: తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డెక్కన్ క్రానికల్ లో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా రీడర్స్ ని ఫూల్స్ చేయడానికి ఈ తప్పుడు వార్తను ప్రచురించారు. అయితే ఈ వార్త తెలుగుదేశం పార్టీ నాయకులకు కోపం తెప్పించింది. మాజీ మంత్రి నారా లోకేష్ పత్రికా యాజమాన్యం, సీఎం జగన్ పై సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు.
''అధికారంలోకొచ్చేవరకూ అసత్యప్రచారమే ఆయుధంగా తన నీలిమీడియా సంస్థల్ని వాడుకున్న జగన్‌రెడ్డి...అధికారంలోకొచ్చాక కూడా అదే అబద్ధాల వార్తలు, అవే అవాస్తవ కథనాలతో విషప్రచారం కొనసాగించాలనుకుని బొక్కబోర్లా పడుతున్నారు. చివరికి తనలాగే అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న దివాళాకోరు వెంకట్రామిరెడ్డి దివాలా పత్రిక డెక్కన్ క్రానికల్‌లో ఏప్రిల్ ఫూల్ వార్తలు రాయించుకునే స్థాయికి దిగజారిపోయారు. జగన్‌రెడ్డికి ఎలాగూ సిగ్గులేదు, వెంకట్రామిరెడ్డికి జన్మతః అటువంటి పదార్థం దేవుడు పెట్టలేదు'' అంటూ లోకేష్ మండిపడ్డారు.
''జర్నలిస్టు పేరుతో ఇలాంటి తప్పుడు కథనాలు రాయడానికి కర్రి శ్రీరామ్ ఇంకెందుకు సిగ్గుపడతాడు? టిడిపి మీద ఇటువంటి ఫూలిష్ ఏప్రిల్ ఫూల్ వార్తలు రాసేబదులు, నువ్వు జర్నలిస్టువే అయితే డెక్కన్ క్రానికల్ గ్రూపు ఉద్యోగులకు చాన్నాళ్లుగా ఇవ్వని జీతాలపై కథనాలు వెయ్. నీకు దమ్ముంటే ఆంధ్రభూమి మూసేసి, ఉద్యోగుల్ని బయటకు తోసేసి నెలలు గడుస్తున్నా దక్కని న్యాయంపై వార్తలు రాయి కర్రి శ్రీరామ్'' అని లోకేష్ సూచించారు.
ఈ వార్తపై ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. ''తెలుగుదేశంపార్టీని బీజేపీలో కలుపుతున్నారంటూ డెక్కన్ క్రానికల్ లో వార్త రాసి ఏప్రిల్ ఫూల్ అని రాయడం తగదు. సామాజిక బాధ్యత కలిగి ఉండాల్సిన పత్రికలు ప్రజల్ని ఫూల్స్ చేసేలా వార్తలు రాయడం పాత్రికేయ విలువల్ని మంటగలపడమే. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ గురించి డెక్కల్ క్రానికల్ తెలుసుకుని వార్తలు రాయాలి'' అని అచ్చెన్న హెచ్చరించారు.
