అభివృద్ధి పనులు పూర్తి చేసిన తర్వాతే ఓట్లడుగుతామంటూ నారా లోకేష్ ప్రకటించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పంచాయితీరాజ్, ఐటి శాఖల మంత్రి లోకేష్ శనివారం కాకినాడ రూరల్ మండలంలో పర్యటించారు. జన్మభూమి కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో చేపట్టిన ఆయా అభివృద్ధి పనులు 2018లోగా పూర్తిచేసి 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లడుగుతామని ప్రకటించారు.

రాష్ట్రలో ఎక్కడ చూసినా జనాలు టిడిపి నేతలను, అధికారులను నిలదీస్తున్న విషయం లోకేష్ కు తెలీదేమో? అభివృద్ధి కార్యక్రమాలు, పోయిన జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఒకవైపు జన్మభూమిలో జనాలు నేతలను నిలేస్తున్నారు. జనాల్లో ఈపాటి చైతన్యం గతంలో ఎన్నడూ కనబడలేదు. మంత్రులు, ఎంఎల్ఏలు, ఫిరాయింపు ఎంఎల్ఏలు, నేతలపై జనాలు విరుచుకుపడుతున్నారు. మరోవైపు జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనేది లేదంటూ విద్యార్ధులు తెగేసి చెబుతున్నారు. జనాల వైఖరి చూసి టిడిపి నేతలు, ఫిరాయింపు ఎంఎల్ఏలు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనకుండానే వెళ్ళిపోతున్నారు. ఇటువంటి నేపధ్యంలో లోకేష్ ప్రకటనపై టిడిపి నేతలు ఆశ్చర్యపోతున్నారు.

సరే, కార్యక్రమం అయిపోయిన తర్వాత పండూరు గ్రామంలో నిర్మించిన మంచినీటి పథకాన్ని హోం మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్పతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని ఆయా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకుగానూ రూ. 22వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అంతేగాక ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేయడమే లక్ష్యమని లోకేష్  పేర్కొన్నారు.