విశాఖపట్నం: బిజెపిపై ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ తీవ్రంగా విరుచుకపడ్డారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగిన ధర్మపోరాట సభలో ఆయన ప్రసంగించారు.

తెలుగువాళ్లతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బిజెపికి కర్ణాటకలో ప్రోమో చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు, కర్ణాటకల్లో బిజెపిని తరిమికొట్టారని ఆయన అన్నారు. బిజెపి నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

హోదాతో పాటు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను అన్నింటినీ సాధిస్తామని చెప్పారు.  బిజెపి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తమ టీడిపిదే విజయమని అన్నారు. కాంగ్రెసుకు పట్టిన గతే రాష్ట్రంలో బిజెపికి పడుతుందని ఆయన అన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి నరేంద్ర మోడీ న్యాయం చేస్తారనే నమ్మకంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆయన చెప్పారు.

రాష్ట్రానికి న్యాయం చేయకపోగా బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆయన విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్‌కు పట్టిన గతే వచ్చేఎన్నికల్లో బీజేపీకి పడుతుందని లోకేష్‌ జోస్యం చెప్పారు. ఏపీలో కనీసం 10 పంచాయతీలు కూడా బిజెపి గెలువలేదని అన్నారు. ఏపీలో విపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.