సడన్ గా దేశ రాజధాని న్యూడిల్లీలో పయనమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై నారా లోకేష్ సీరియస్ ఆరోపణలు  చేసారు. కేసులు నుండి బయటపడేయాలనో లేదా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని కోరడానికో జగన్ డిల్లీలో పర్యటిస్తున్నారని అన్నారు.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) దేశ రాజధాని న్యూడిల్లీలో పయనమయ్యారు. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah)లతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. అయితే జగన్ సడన్ గా డిల్లీకి వెళ్ళడం వెనక రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా సొంత ప్రయోజనాలు వున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) ఆరోపించారు. జగన్ డిల్లీ పర్యటనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేసిన లోకేష్ ఓ పోల్ పెట్టారు.

పేలని జ'గన్' హస్తిన పయనమెందుకు?

ఏ1) బాబాయ్ హత్యలో దొరికిన అవినాష్ రెడ్డిని తప్పించేందుకు.

ఏ2) తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ.48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయాలని.

ఏ3) తన పై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలని.

ఏ4) లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని.

అంటూ నారా లోకేష్ ట్విట్టర్ లో పోల్ పెట్టారు. 

ఇదిలావుంటే ఇప్పటికే డిల్లీ వెళ్లిన జగన్ రెండు రోజులపాటు అక్కడే వుండనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో సీఎం చర్చించే అవకాశం వుంది. 

రాష్ట్ర విభజన సమయంలో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ఇచ్చిన హామీమేరకు ప్రత్యేక హోదా (ap special status) ఇవ్వాలని మరోసారి ప్రధానిని సీఎం జగన్ కోరనున్నారు. అలాగే కేంద్ర సహకారంతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ (polavaram project)పై కూడా చర్చించనున్నారు. పోలవరం నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేయాలంటే ఇప్పటికే అందించాల్సిన బకాయిలతో పాటు ఇకపై అవసరమయ్యే నిధులు అందించాలని సీఎం కేంద్రాన్ని కోరనున్నారు. అలాగే కడప స్టీల్ ప్లాంట్ (kadapa steel plant), దుగరాజపట్నం (dugarajapatnam port) ఓడరేవు వంటి అంశాలపై కూడా కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు. 

అయితే కేంద్ర హోమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ వ్యక్తిగత కారణాలతో సమావేశమవుతున్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తనపై వున్న కేసుల విచారణ కీలక దశకు చేరుకోడంతో వాటినుండి బయటపడేలా చూడాలని కోరడానికే అమిత్ షాతో సమావేశం అవుతున్నట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి (ys viveka murder) హత్యకేసు నుండి తన కుటుంబసభ్యులను కాపాడుకునేందుకు జగన్ కేంద్ర హోంమంత్రితో సమావేశం అవుతున్నట్లు ఆరోపిస్తున్నారు. 

కానీ వైసిపి (ysrcp) నాయకులు మాత్రం తెలంగాణతో వివాదంపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రిని సీఎం జగన్ కలుస్తున్నారని అంటున్నారు. కేంద్ర హోంశాఖ ఇటీవల తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేస్తూ... ఏపీ వాదనను హోమంత్రి ముందు వుంచేందుకే సీఎం జగన్ కలుస్తున్నట్లు తెలిపారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ డిల్లీ పర్యటనకు వెళ్లినట్లు వైసిపి నాయకులు పేర్కొంటున్నారు.