అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ పేరు కూడా తెలియకుండా పార్లమెంటులో వైసీపీ ఎంపీ స్టాండప్ కామెడీకి తాను ఫిదా అయిపోయినట్లు ఆయన తెలిపారు. 

"అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కెంపనీ పేరు కూడా తెలుసుకోకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ అంటూ పార్లమెంటులో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడి నన్ను ఫిదా చేసింది" అని ఆయన అన్నారు.

"ఫ్రాంక్లిన్ చంద్రబాబుగారి బినామీ కెంపెనీ కదా... అలాంటి కంపెనీలో మీరెందుకు పెట్టుబడులు పెట్టారని జగన్ గారిని నిలదీయండి ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ ఎంపీగారు. ఒక అంతర్జాతీయ సంస్థ ఉత్తరాంధ్రకి రావడం జగన్ గారికి మొదటి నుండీ ఇష్టం లేదు" అని నారా లోకేష్ అన్నారు.

"ఉత్తరాంధ్ర యువతకి మంచి ఉద్యోగాలు రావడం వైకాపా నాయకులకు రుచించడం లేదు. ఎప్పటికీ ఉత్తరాంధ్ర వెనుబడి ఉండాలి అనే దురుద్దేశంతో కంపెనీలు రాకుండా అడ్డుపడుతున్నారు. బినామీ కంపెనీలు అంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టే కంపెనీలు జగన్ గారిని చూసి బైబై ఏపీ అంటున్నాయి"  అని నారా లోేకష్ అన్నారు.