ముఖ్యమంత్రి చేస్తున్నది చాలదా..? వై ఏపీ నీడ్స్ జగన్? : నారా లోకేష్ సీరియస్
వైసిపి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమం గురించి ప్రజలకు వివరించేందుకు చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై నారా లోకేష్ సెటైర్లు వేసారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అధికార వైసిపి కొత్తకొత్త కార్యక్రమాలను ప్రజల్లోకి వెళుతోంది. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్, జగనన్న సురక్ష, సామాజిక సాధికారత బస్సు యాత్రల పేరిట వైసిపి నిత్యం ప్రజల్లో వుండేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా ఇవాళ్టినుండి 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంపై టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ సెటైర్లు వేసారు.
''ఆంధ్ర ప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలి... రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతున్నది అదే. జగన్ చేయగలిగింది కేవలం తమ రాష్ట్రాన్ని దోచుకోవడం, నాశనం చేయడం మాత్రమే అయినప్పుడు ఏపీకి ఎందుకు అవసరం?'' అని అడుగుతున్నారంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
ఇదిలావుంటే గురువారం నుండి ఆంధ్ర ప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలో వివరించేందుకు 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమాన్ని వైసిపి ప్రారంభించింది. పార్టీతో పాటు ప్రభుత్వమూ కలిసి నిర్వహించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. వైసీపీ పాలనలో జరిగిన రాష్ట్ర అభివృద్ధి, అందించిన సంక్షేమం గురించి ప్రజలకు వివరించనున్నారు.
Read More ఆర్మీ జవాన్ పై అమానుషంగా దాడిచేసిన పోలీసులు... డిజిపి సీరియస్ యాక్షన్
పట్టణాలు, గ్రామాల్లో వైసిపి జెండా ఆవిష్కరించి స్థానిక నాయకులే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోనున్నారు. సచివాలయాల వారీగా జరిగిన అభివృద్ధిని బోర్డులపై ప్రదర్శించనున్నారు. ఇక వైసిపి నాయకులు ఇంటింటికి వెళ్లి వైసిపి పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు. అలాగే వైసిపి అందిస్తున్న పథకాల గురించి... రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది గురించి వారికి వివరించనున్నారు.