గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో అధికారం, పోలీసులను అడ్డు పెట్టుకుని వైసిపి శ్రేణులు టిడిపి నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఇలా వైసిపి మూకల దాడిలో వైసీపీ మూక‌ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన సత్తెనపల్లె రూరల్ మండలం లక్కరాజుగార్లపాడు టిడిపి కార్య‌క‌ర్త  గరికపాటి క్రిష్ణారావు హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందార‌ని స‌మాచారం తెలిసి తీవ్ర‌ దిగ్బ్రాంతికి గుర‌య్యానంటూ సోషల్ మీడియా వేదికన నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 

''కృష్ణారావు కుటుంబానికి అన్నివిధాలా అండ‌గా నిలుస్తామ‌ని హామీ ఇస్తున్నాను. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా జ‌ర‌గాల్సిన ఎల‌‌క్ష‌న్‌ని ఫ్యాక్ష‌న్ చేసిన వైఎస్ జగన్ నామినేష‌న్ వేశార‌న్న కార‌ణంతో కొంద‌రిని చంపేశారు. వైసీపీకి ఓట్లు వేయ‌క‌పోతే ప‌థ‌కాలు తీసేస్తామ‌ని వాలంటీర్ వ్య‌వ‌స్థ‌తో బెదిరించి మ‌రీ ఓట్లేయించుకున్నారు. ఇన్ని అరాచ‌కాలకు ఎదురొడ్డి గెలిచిన టిడిపి మ‌ద్ద‌తుదారుల‌ను చివ‌రికి అంతం చేస్తున్నారు. అయినా తెలుగుదేశ‌మూ భ‌య‌ప‌డ‌దు, టిడిపి కార్య‌క‌ర్త‌లూ భ‌య‌ప‌డ‌రు. నీ నియంత పాల‌న‌ని అంత‌మొందించేవ‌ర‌కూ పోరాడుతూనే వుంటాం'' అని లోకేష్ హెచ్చరించారు. 

ఇక అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంపై స్పందింస్తూ ''తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి జగన్  పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది.అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు?'' అని నిలదీశారు. 

''21నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సి,ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు.సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు.అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా,దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది'' అని లోకేష్ పేర్కొన్నారు.