మంగళగిరి బుధవారం పట్టపగలే చోటుచేసుకున్న వివాహితపై అత్యాచారం, హత్య ఘటనపై నారా లోకేష్ సీరియస్ గా స్పందించారు. ఇంట్లోకి చొరబడి మరీ వివాహితపై అత్యాచారం జరిపి హతమార్చడం దారుణమన్నారు.
గుంటూరు: మానసిక వికలాంగురాలిపై విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోనే సామూహిక అత్యాచారం ఘటన మరువకముందే తాజాగా గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. పట్టపగలే ఇంట్లో ఒంటరిగా వున్న వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హతమార్చారు దుండగులు. ఈ దారుణంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు.
''జగన్ రెడ్డి అరాచక పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. దాడికి గురైన ఒక యువతికి న్యాయం చేయాలని పోరాడుతుండగానే ఇంకో మహిళ పై అఘాయిత్యం జరుగుతుంది. రేపిస్టులని ఉరి తియ్యాల్సిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకి మద్దతుగా నిలిచేవారికి నోటీసులు ఇవ్వడం, కేసులు నమోదు చేయడం తాలిబన్ల పాలనని తలపిస్తోంది'' అని లోకేష్ మండిపడ్డారు.
''గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం దారుణం. సామూహిక అత్యాచారానికి పాల్పడి బలిగొన్న మృగాళ్లని కఠినంగా శిక్షించాలి. అత్యాచారాలు, హత్యలతో బరితెగించిన నిందితులని ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తుండడం వల్లే నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వైసీపీ పాలనలో ఇప్పటివరకు 800 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలకి పాల్పడిన మానవమృగాళ్లలో ఒక్కరికైనా శిక్ష పడి వుంటే వారికి భయం పుట్టేది'' అంటూ వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ మహిళల రక్షణ విషయంలో అలసత్వం వహిస్తున్నారని లోకేష్ ఆరోపించారు.
అసలేం జరిగిందంటే:
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మలపూడికి చెందిన శ్రీనివాసరావుకు 15ఏళ్ళ క్రితం వివాహమయ్యింది. అయితే వ్యాపార పనులపై ఇతర ప్రాంతాలకు వెళుతూ నెలల పాటు ఇంటికి దూరంగా వుండేవాడు. దీంతో అతడి భార్య ఒంటరిగా వుండేది. ఇలా ప్రస్తుతం కూడా అతడి భార్య ఇంట్లో ఒంటరిగా వుంటోంది. ఈ విషయం తెలిసి కొందరు దుండగులు పట్టపగలే దారుణానికి ఒడిగట్టారు.
బుధవారం మహిళ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డ గుర్తుతెలియని దుండుగులు అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ విషయం బయటకు తెలిస్తే తాము దొరికిపోతామని భావించి వివాహితను హతమార్చి పరారయ్యారు. ఇంటిపక్కన వుండే యువకుడు వివాహిత మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్య వెలుగుచూసింది.
మహిళ ఒంటిపై దుస్తులు సరిగ్గా లేకపోవడం, శరీరంపై గాయాలుండటంతో హత్యాచారం జరిగివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేగాని మహిళది సాధారణ హత్యా లేక అత్యాచారం చేసి హతమార్చారా అన్నది తేలనుంది. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
