విశాఖపట్నం: కరోనా రోగులకు వైద్యం అందించడంలో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఓ  ఓ పాజిటివ్ పేషెంట్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు కరోనా వార్డులోని రోగుల పరిస్థితి ఎంత దారుణంగా వుందో చూడండంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. 

''కరోనా బారిన పడి ప్రజల ప్రాణాలు పోతుంటే వైఎస్ జగన్ గారు తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటున్నారు. కరోనా పెద్ద విషయం కాదు. పేరాసిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న జగన్ ఏం సమాధానం చెబుతారు'' అంటూ ట్విట్టర్ ద్వారా లోకేష్ నిలదీశారు. 

 

 ''విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రిలో పరిస్థితి నరకాన్ని తలపిస్తుందని చికిత్స పొందుతున్న వారు గగ్గోలు పెడుతున్నారు.ప్రాణాలు పోతున్నా పట్టించుకున్న నాధుడు లేడు అంటూ కన్నీరు పెడుతున్నారు. ప్రజల్ని గాలికొదిలేసి మూడు రాజధానుల సంబరాల్లో మునిగిపోయింది వైకాపా ప్రభుత్వం'' అని లోకేష్ మండిపడ్డారు.

ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపు పేటకు చెందిన కరోనా పేషేంట్స్ ని చెత్త వ్యాన్ లో తరలించిన అమానుష ఘటనపై కూడా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''పబ్లిసిటీ పిచ్చి తప్ప వైఎస్ జగన్ గారికి ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదు.ఇదొక చెత్త ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఎం కావాలి.విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం,జరజాపు పేట బిసి కాలనిలో కరోనా బారిన పడిన ముగ్గురు వ్యక్తులను చెత్త బండిలో తరలించారు. ఇది అమానుష ఘటన'' అని అన్నారు. 

''ఆసుపత్రుల్లో చనిపోయిన వారిని గంటల తరబడి అలానే వదిలేస్తున్నారు.కరోనా బారిన పడిన వారిని కనీసం మనుషుల్లా కూడా చూడకుండా చెత్త బండిలో తరలించడం దారుణం.మొద్దునిద్రపోతున్న సర్కార్ మేల్కోవాలి.ప్రతిపక్ష పార్టీ పై కక్ష సాధింపు వాయిదా వేసి ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టండి జగన్ గారు'' అంటూ  సూచించారు.