గుంటూరు: సీఆర్‌డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. దీంతో ఒక్కసారిగా రాజధాని అమరావతి ప్రాంతంలో అలజడి మొదలయ్యింది. ఈ క్రమంలోనే టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ఈ విషయంపై సోషల్ మీడియా వేదికన స్పందిస్తూ న్యాయస్థానాల్లో ఈ తేల్చుకుంటామని అన్నారు. 

''వ్యవస్థల్ని నాశనం చెయ్యడం వైఎస్ జగన్ గారి ట్రేడ్ మార్క్. ఆ ట్రాప్ లో గవర్నర్ గారు చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. మూడు ముక్కలాటకి గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే'' అంటూ గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు లోకేష్. 

''జగన్ రెడ్డి ఎస్ఈసి విషయంలో ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైకాపా ప్రభుత్వానికి భంగపాటు తప్పదు'' అని హెచ్చరించారు. 

''ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టిడిపి నినాదం. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుంది. ప్రజారాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతాం'' అని ట్విట్టర్ వేదికన నారా లోకేష్ స్పష్టం చేశారు.