త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ ఓటమి ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.  పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. యువగళం వాలంటీర్లను జైలుకు పంపారని, జగన్‌కు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. 

త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ ఓటమి ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలోని నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తొలిసారిగా ఎన్టీఆర్ చైతన్య యాత్ర చేశారని గుర్తుచేశారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పాదయాత్రలు చూశానని, కానీ ఎప్పుడూ పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవన్నారు. కానీ జగన్ పాలనలోనే ఇలాంటి ఘటనలు చూశామని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. యువగళం వాలంటీర్లను జైలుకు పంపారని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోందని.. మెడపై కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ ఇప్పుడు గంజాయికి రాజధానిగా మారిందని , కబ్జాలు పెరిగాయని చంద్రబాబు దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని.. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. రుషికొండను బోడిగుండు చేసి సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు.

Also Read: మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్‌ను , ఈసారి వైసీపీ వస్తే మనం కత్తి పట్టాల్సిందే : పవన్ సంచలన వ్యాఖ్యలు

అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కలాట ఆడారని ఆయన మండిపడ్డారు. త్వరలో అమరావతి, తిరుపతి సభలు నిర్వహించి టీడీపీ, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని.. అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఆర్ధిక సాయం చేస్తామన్నారు. టీడీపీ జనసేన పొత్తు చారిత్రక అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదని, జగన్ రాజకీయాలకు అనర్హుడని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని.. టీడీపీ, జనసేనకు ఓటు వేస్తారనుకుంటే వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ మారాలని ఆయన ఆకాంక్షించారు.