వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ 80 మంది ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని.. కానీ మార్చాల్సింది వారిని కాదని జగన్‌ను అని ఆయన చురకలంటించారు.
వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బుధవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలోని నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. యువగళం పాదయాత్ర జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదన్నారు. ఇలాంటి పాదయాత్రల వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయని.. తనకు రాని అవకాశాన్ని నారా లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా వుందని పవన్ తెలిపారు. ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌కి రావాలని ఉవ్విళ్లూరేవాళ్లని, ఏపీ ఒక మోడల్ స్టేడ్ అని అక్కడికి వెళ్లాని చెప్పేవారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఏపీకి ఎందుకు వెళ్లకూడదో చెబుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని.. తాను ఏదో ఆశించి ఆయనకు మద్ధతు ఇవ్వలేదన్నారు. జగన్ చేసిన తప్పులకు సోనియా గాంధీ జైళ్లో పెట్టించారని, ఈ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టించడం దారుణమన్నారు. విభజన సమయంలో తాను పోటీ చేయకుండా టీడీపీకి మద్ధతు ఇచ్చానని.. 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ 80 మంది ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని.. కానీ మార్చాల్సింది వారిని కాదని జగన్‌ను అని ఆయన చురకలంటించారు.
ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్‌కు విలువ తెలియదని, మహిళలను కించపరిచే సంస్కృతికి వైసీపీ శ్రీకారం చుట్టిందన్నారు. ఇంట్లో వున్న చెల్లికి, తల్లికి జగన్ విలువనివ్వరని.. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే తనతో సహా అంతా వైసీపీ గూండాలను ఎదుర్కోవటానికి కర్రో, కత్తో పట్టుకోవాల్సి వస్తుందన్నారు. టీడీపీతో తప్పించి మరో ప్రత్యామ్నాయం లేదని ఢిల్లీ పెద్దలకు చెప్పానని, కేంద్రంలోని బీజేపీ పెద్దల మద్ధతు మనకు వుంటుందని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. త్వరలోనే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని.. ఈ మైత్రి చాలా ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హల్లో ఏపీ.. బైబై వైసీపీ అనేది ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు.
