అమరావతి: రాష్ట్రానికి చెందిన యువతకు విదేశీ విద్యను దగ్గర చేయాలన్న ఉద్దేశ్యంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ సీఎం అయ్యాక వైసిపి ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 

''మీ పిల్లలకు మాత్రమే విదేశీ విద్యా?బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్య, విదేశీ విద్యకు అర్హులుకారా జగన్ రెడ్డి గారు? ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చారు. విద్యార్థుల భవిష్యత్తు ని అంధకారం చేసారు'' అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికన మండిపడ్డారు.

 

''ఒక మైనార్టీ మహిళ తన కుమార్తెను విదేశాల్లో చదివించాలని కల కనడం తప్పా? కూతురు విదేశీ విద్యకు ప్రభుత్వ సహాయం అందించాలని కలవని నాయకుడు లేడు, పెట్టని అర్జీ లేదు. స్పందన కరువవ్వడంతో హిందూపురం నుండి అమరావతి కి ఒంటరిగా 750 కిమీ నిరాహార యాత్ర చేసారు ముక్బుల్ జాన్'' అని పేర్కొన్నారు. 

''సహాయం అందించని ప్రభుత్వం పోలీసుల్ని పంపి ఆమె యాత్రని అడ్డుకొని అనేక ఇబ్బందులు పెట్టారు. ఆమె ఆవేదన వింటే జగన్ రెడ్డిది ఎంత చెత్త పరిపాలనో కళ్ళకు కట్టినట్లు అర్ధమవుతుంది'' అంటూ లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.