ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరకుపైగా సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటినుంచే ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరకుపైగా సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటినుంచే ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ.. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్తుంది. జనసేన కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు.
గత కొన్ని నెలలుగా లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ నుంచే లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారనే ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవుతుందని టీడీపీ వర్గాల నుంది అందుతున్న సమాచారం.
మొత్తంగా 400 రోజుల పాటు పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి పాదయాత్ర ముగించేలా షెడ్యూల్‌ను రూపొందించనున్నారు. చిత్తూరు జిల్లా నుంచి యాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించాలని లోకేశ్ ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా సమాచారం. అన్ని ప్రాంతాలను సందర్శించేలా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఎలాంటి విరామం లేకుండా పాదయాత్రను కొనసాగించాలని లోకేష్ భావిస్తున్నట్టుగా తెలస్తోంది. ఈ యాత్ర ద్వారా పార్టీకి క్షేత్రస్థాయిలో జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీ కోసం పేరుతో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.
