గుంటూరు: నటసింహ నందమూరి బాలకృష్ణ 60వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. హీరోగా సినీ ప్రముఖులు, అభిమానుల నుండి హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ ప్రముఖులు, ప్రజల నుండి శుభాకాంక్షలు అందుకుంటున్నారు. అలాగే కుటుంబసభ్యులు కూడా బాలయ్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు విషెస్ తెలుపుతున్నారు. అలా నారా లోకేష్ ట్విట్టర్ వేదికన బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
''అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.  

''నిన్న బాలా మావయ్య కొత్త సినిమా టీజర్ చూసాను. చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. మావయ్యా... మీరు మరెన్నో చిత్రాల్లో నటించి... మీ అభిమానులకు ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను'' అంటూ బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా టీజర్ పై లోకేష్ ప్రశంసలు కురిపించారు.