పుట్టగతులుండవు: బిజెపిపై నారా లోకేష్ శాపనార్థాలు

Nara Lokesh attacks BJP
Highlights

బిజెపిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు.

ఒంగోలు: బిజెపిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. తెలుగుజాతితో పెట్టుకున్నవారు ఎవరు కూడా మనుగడ సాగించలేదని, బిజెపికి పుట్టగతులుండవని ఆయన అన్నారు. 

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలు కేవలం ట్రయలర్‌ మాత్రమేనని. అసలు సినిమా 2019లో ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీ భవిష్యత్‌ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 

వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీపరిధిలో జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాటలతో మభ్యపెట్టి కాలయాపన చేసిందని ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబును 29 సార్లు ఢిల్లీకి తిప్పారని, అయినా కూడా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ మోదీ ప్రభుత్వం అమలుచేయలేదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిపించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు సీఎం చంద్రబాబును ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. వైసీపీ ఎంపీలు 2015లోనే రాజీనామా చేస్తాం, 2016, 2017ల్లో కూడా చెప్పారని, ఇప్పుడు ఉప ఎన్నికలు రావని తేలాకే రాజీనామా పత్రాలు ఇచ్చి డ్రామా ఆడుతున్నారని అన్నారు. 

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడరని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతున్న సీఎంకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడతారని ఆయన అన్నారు.

loader