చంద్రబాబుపై 15 రోజులకో కేసు: గవర్నర్‌తో లోకేష్ నేతృత్వంలో టీడీపీ బృందం భేటీ
రాష్ట్రంలో టీడీపీ శ్రేణులపై కేసుల విషయమై ఆ పార్టీ అన్ని వేదికల వద్ద ప్రస్తావించాలని భావిస్తుంది. గ్రామస్థాయి నుండి చంద్రబాబుపై నమోదైన కేసుల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది టీడీపీ.
అమరావతి: పదిహేను రోజులకు ఒక కేసు చంద్రబాబుపై పెడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు.
మంగళవారంనాడు అమరావతిలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో నారా లోకేష్ నేతృత్వంలోని టీడీపీ బృందం భేటీ అయింది. చంద్రబాబు అరెస్ట్, టీడీపీ నేతలపై అక్రమ కేసులపై గవర్నర్ కు వివరించారు లోకేష్ బృందం. ఈ సమావేశం ముగిసిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకుల పై పెట్టిన అక్రమ కేసుల వివరాలు గవర్నర్ కి అందించినట్టుగా ఆయన చెప్పారు.
ఇప్పటి వరకు 60 వేల కేసులు పెట్టారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పై 100 కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ నాయకుల పై కేసులు పెట్టి 100 రోజులు పైనే జైళ్లలో పెట్టారన్నారు.చంద్రబాబు పై పెట్టన అక్రమ కేసులు గురించి గవర్నర్ కు వివరించినట్టుగా లోకేష్ తెలిపారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను అడ్డుకొన్నారో వివరించినట్టుగా ఆయన చెప్పారు.శ్యామ్ బాబు, అమర్నాథ్, నిస్పా ఆత్మహత్య అంశాలు గవర్నర్ వద్ద ప్రస్తావించామన్నారు. రేపు ఎలక్షన్ కమిషన్ ని టీడీపీ బృందం కలవనుందన్నారు. గ్రామ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు కేసులున్నాయని లోకేష్ వివరించారు.
ఎన్ని కేసులు పెట్టిన మేము యుద్ధం చేస్తామన్నారు. 2019 నుండి ఆంద్రప్రదేశ్ లో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నర్ దని ఆయన చెప్పారు. రాజ్యాంగాన్ని గవర్నర్ కాపాడతారని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
also read:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు:చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 22కి వాయిదా
17ఏ సెక్షన్ గురించి గవర్నర్ దృష్టి కి తీసుకు వచ్చినట్టుగా లోకేష్ తెలిపారు. ఈ విషయమై వివరాలు తెప్పించుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని లోకేష్ చెప్పారు. ప్రతిపక్షాలపై జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చామన్నారు.న్యాయవ్యవస్థపై వైఎస్ఆర్‌సీపీనేతలు దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకోసం పోరాటం చేస్తే దొంగ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబుపై కేసులు పెట్టారని లోకేష్ పునరుద్ఘాటించారు.