చంద్రబాబు అరెస్ట్ : సిట్ కార్యాలయానికి భువనేశ్వరి, లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు
సీఐడీ అదుపులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, నందమూరి రామకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు కార్యకర్తలు సిట్ కార్యాలయానికి వచ్చారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం సీఐడీ అదుపులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, నందమూరి రామకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు కార్యకర్తలు సిట్ కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి, లోకేష్‌లకు అనుమతి ఇచ్చారు అధికారులు. మరోవైపు.. చంద్రబాబును కలిసేందుకు సినీనటుడు, ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, కోడలు నారా బ్రాహ్మణి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు.
విమానాశ్రయం వద్ద బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ఛార్జీషీట్ వేయకుండా ఎందుకు ఊరుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం తాను కూడా ఎన్నో క్యాంపులు ఏర్పాటు చేశానని బాలయ్య గుర్తుచేశారు. చంద్రబాబును జైల్లో పెట్టేందుకే ఈ కేసును బయటకు తీశారని పేర్కొన్నారు.
మరోవైపు.. సీఐడీ కార్యాలయంలో ప్రక్రియ పూర్తయిన తర్వాత చంద్రబాబును జీజీహెచ్‌కు తరలించి అక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. చంద్రబాబు తరఫును సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఇందుకోసం సిద్దార్థ లూథ్రా ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సీఐడీ సమర్పించిన ఆధారాలు, ఇరువైపుల వాదనల అనంతరం.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలా? వద్దా? అనే దానిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జ్ఞానాపురంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో హైడ్రామా నెలకొంది. ఆయన అరెస్టు కోసం సీఐడీ అధికారులు రాత్రికి 2.30 గంటలకు ఫంక్షల్ హాల్ వద్దకు చేరుకున్నప్పటికీ.. ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు.