చంద్రబాబును మానసికంగా ఇబ్బంది పెట్టలేరు: నారా భువనేశ్వరి

చంద్రబాబు కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై  దాడులు చేయడాన్ని  నారా భువనేశ్వరి తప్పుబట్టారు

 Nara Bhuvaneswari Serious Comments on YS jagan government lns

రాజమండ్రి: టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు తమ బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని అన్నారు. 

సోమవారంనాడు నారా భువనేశ్వరి మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న అణచివేత ధోరణిని భువనేశ్వరి తీవ్రంగా తప్పుబట్టారు. 

కార్యకర్తలు తమ బిడ్డలతో సమానమన్నారు.ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం నేడు హింసకు గురవుతున్నారని, అక్రమ కేసులకు గురై జైలుకు వెళ్తున్నారన్నారు. పార్టీ కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టారని  పార్టీ కార్యకర్తల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు.  టీడీపీ కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లన్నారు.పార్టీ కార్యకర్తలు లేకపోతే పార్టీయే లేదన్నారు.

also read:ప్రజల సొమ్ము మాకు అవసరం లేదు: జగ్గంపేటలో చంద్రబాబు అరెస్ట్ పై భువనేశ్వరి

 పోలీసులు ఏం చేసినా టీడీపీ కార్యకర్తలు బెదరరని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.  నిరాహార దీక్ష చేస్తున్న వారిపై లాఠీలతో కొట్టడం బాధాకరమన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలందరికీ భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. 

చిల్లర పనులతో చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరన్నారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  చంద్రబాబు నాయుడు భోజనం చేసేందుకు చిన్నపాటి సౌకర్యం కల్పించలేదన్నారు. 

అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి చిల్లర ఆలోచనలతో చంద్రబాబును ఎవరూ మానసిక క్షోభకు గురిచేయలేరని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios