తల్లి వర్ధంతికి కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకుంటారా?.. ఇదెక్కడి న్యాయం?: నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన తీవ్ర కలిగిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన తీవ్ర కలిగిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు ఈ నెల 16 నుంచి తన భర్తను అక్రమంగా నిర్బంధిస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా, సహేతుకమైన కారణాలు కూడా లేకుండా నిర్బంధిస్తున్నారని చెప్పారు.
అయితే ఈ పరిణామాలపై నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకుంటారా? అని భువనేశ్వరి ప్రశ్నించారు. ఇదేమి చట్టం... ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నట్టుగా చెప్పారు.
‘‘తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? ఇదేమి చట్టం... ఇదెక్కడి న్యాయం?. కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి నన్ను ఎంతో బాధించింది. వ్యవస్థల నిర్వీర్యం అని చంద్రబాబు గారు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నాను’’ ఎక్స్(ట్విట్టర్) పోస్టులో భువనేశ్వరి పేర్కొన్నారు.