నందిగామ వైసిపిలో పాలి'ట్రిక్స్'... జగన్ ను కలిసిన జడ్పిటిసి, ఎమ్మెల్యేగా పోటీకి సై..! (వీడియో)
మహిళా జడ్పిటిసి ఒకరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంతో నందిగామ వైసిపిలో అలజడి రేగింది. అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీచేస్తానంటూ సదరు జడ్పిటిసి వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.

నందిగామ : ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల చిత్తుచేయడానికి వ్యూహప్రతివ్యూహాలను రచిస్తున్నాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. ఇలా ఇప్పటికే వైసిపి అధినేత వైఎస్ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఇకపై గేర్ మార్చాలని... లేదంటే టికెట్ కష్టమేనని సిట్టింగ్ లకు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇలా అధినేత వ్యాఖ్యలతో అధికార పార్టీలో అలజడి మొదలైనవేళ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసిపిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
నందిగామ నియోజకవర్గానికి చెందిన వైసిపి జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దంగా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆమె కలవడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. దీంతో ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేందుకు వీరులపాడు జడ్పిటిసి సౌజన్య మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Read More ఎన్నికల వేళ బిసి మంత్రం... టిడిపి-జనసేన కూటమి ఉమ్మడి కార్యాచరణ ఇదేనా?
వైసిపి అధిష్టానం తనపై నమ్మకం వుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానని జడ్పిటిసి సౌజన్య స్పష్టం చేసారు. తాను నందిగామ టికెట్ ఆశించడం లేదు కానీ ఒకవేళ అధిష్టానమే పోటీచేయమంటే తప్పకుండా చేస్తానని అన్నారు. నందిగామలో మరోసారి వైసిపి జెండా ఎగరేసేందుకు కృషిచేస్తానని... ఇందుకోసం అధిష్టానం ఏ నిర్ణయం తీసకున్నా కట్టుబడి వుంటానని సౌజన్య అన్నారు.
వీడియో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడంపైనా జడ్పిటిసి సౌజన్య క్లారిటీ ఇచ్చారు. జడ్పిటిసిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మర్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లు తెలిపారు. బయట ప్రచారం జరుగుతున్న తనకు నందిగామ టికెట్ కావాలని గానీ... ఇతర రాజకీయ వ్యవహారాలపై గానీ తాను మాట్లాడలేదని అన్నారు. విజయవంతంగా రెండుసంవత్సరాల పదవీకాలం ముగించుకున్నందుకు జగన్ అభినందనలు తెలిపినట్లు సౌజన్య తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశానుసారం నందిగామ అభివృద్ది కోసం ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ నేతృత్వంలో పనిచేసానని అన్నారు. మొండితోక బ్రదర్స్ నియోజకవర్గ అభివృద్దికి పాటుపడుతున్నారని.... వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నందిగామ అభివృద్దికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి వుందని... తనవంతుగా కూడా ఇక్కడి ప్రజలకు తోచిన సేవ చేస్తున్నానని సౌమ్య అన్నారు. ఏపిసి సహకారంతో కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని పలుగ్రామాల్లో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసామన్నారు. అలాగే తాను జడ్పిటిసిగా వున్న వీరులపాడు మండలంలో అనేక అభివృద్ది పనులు చేసానని సౌమ్య వెల్లడించారు.
జడ్పిటిసి కీర్తి సౌజన్య సీఎం జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జోషి మేనకోడలు. మేనమామ సహకారంతో ఆమె ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ తో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని... అందుకోసమే ఇటీవలే సౌమ్య సీఎంను కలిసినట్లు సమాచారం. ఇలా మొండితోక బ్రదర్స్ కు చెక్ పెట్టేందుకు జడ్పిటిసి సిద్దమైనట్లు రాజకీయ ప్రచారం జోరుగా సాగుతోంది.