హైదరాబాద్: ఏపీ రాజకీయాలన్నీ జూ.ఎన్టీఆర్ కేంద్రంగా నడుస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నికల ప్రచారంలో వాడుకుని వదిలేశారంటూ వైసీపీ ఆరోపిస్తుంటే తమకు జూనియర్ ఎన్టీఆర్ అవసరమే లేదని టీడీపీ చెప్తోంది. 

మెుత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు అయిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ ను 2009లో ప్రచారం వరకు వాడుకుని ఆ తర్వాత వదిలేశారని ఆరోపించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ తెలుగుదేశం పార్టీని తీసేసుకుంటారోనన్న భయంలో చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఉన్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. 

ఏపీ రాజకీయాలు ముఖ్యంగా బెజవాడ రాజకీయాలన్నీ తన చుట్టే తిరుగుతున్న తనకు అత్యంత సన్నిహితులే తన గురించి ప్రస్తావిస్తుండటంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. జూనియర్ ఎన్టీఆర్ పై కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చేస్తున్న వ్యాఖ్యలపై నందమూరి వారసుడు చైతన్య కృష్ణ ఘాటుగా స్పందించారు. 

గత నాలుగు రోజులుగా మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ టీడీపీపై చేస్తున్న విమర్శలపై చైతన్య కృష్ణ మండిపడ్డారు. ఇద్దరు నేతలు ఒకప్పుడు తమ మావయ్య చంద్రబాబు నాయుడు సీటు ఇస్తేనే ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేశారు. 

మంత్రి కొడాలి నానికి 2004, 2009లో సీటిచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇకపోతే ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు 2009లో విజయవాడ ఎంపీ సీటు ఇచ్చారని అప్పుడు ఓడిపోవడంతో గన్నవరం టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. 2014, 2019లో గన్నవరం నియోజకవర్గం సీటిచ్చారని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు నాయుడు వల్లే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ లు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడును గౌరవించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

నాలుగు రోజులుగా టీవీలలో కొడాలి నాని, వల్లభనేని వంశీలు చంద్రబాబుపై వాడుతున్న భాషను చూసి బాదేసిందన్నారు. బండబూతులు తిడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. మీకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తిని ఇలా విమర్శిస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

నీ అమ్మ మెుగుడు కట్టాడా తిరుపతి అంటూ మంత్రి కొడాలి నాని మాజీమంత్రి చంద్రబాబు నాయుడును తిట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారని ఆయనను చూసి ప్రతీ ఒక్కరూ ఆదర్శవంతంగా ఉండాలే కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 

ఇకపోతే ఒక ప్రముఖ ఛానెల్ లో టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు చూస్తే చాలా బాధేసిందన్నారు. అయ్యప్పమాలలో ఉంటూ బండబూతులు తిడతారా అంటూ నిలదీశారు. 

ఇప్పటికైనా వల్లభనేని వంశీమోహన్, కొడాలి నానిలు తమ ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. మరోసారి చంద్రబాబునాయుడుపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే ఇద్దరికీ మంచిది కాదని చైతన్య కృష్ణ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. 

సొసైటీలో ఒకరు మంత్రిగా మరోకరు ఎమ్మెల్యేగా ఉన్నారంటూ అది తన మావయ్య చంద్రబాబు నాయుడు వల్లేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. 

నోరు ఉందికదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరూ కూర్చోలేదన్నారు. గాజులు తొడుక్కుని ఎవరూ కూర్చోలేదని హెచ్చరించారు. మంచిగా మాట్లాడాలని విధివిధానాలపై విమర్శలు చేసుకోండి తప్పులేదు గానీ భూతులు తిడితే సహించేది లేదని హెచ్చరించారు.  

ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తూ, బండ భూతులు తిడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇది సరైన విధానం కాదన్నారు. మరోసారి ప్రెస్మీట్ పెట్టి ఇలా విమర్శలు చేస్తే పద్ధతిగా ఉండదని నందమూరి చైతన్యకృష్ణ హెచ్చరించారు. టేక్ కేర్ అంటూ ఘాటుగా హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం, కారణం ఆ ఇద్దరే: టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు