విజయవాడ: సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా కృష్ణా జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారని వైసీపీ టీడీపీని విమర్శిస్తుంటే...ముగిసిన కథ ఇప్పుడెందుకు అంటూ టీడీపీ వాదిస్తోంది. 

జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ టీడీపీలోకి వస్తారన్న భయంతో చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ బెదిరిపోతున్నారంటూ విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. అయితే కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ మౌనం దాల్చిందే తప్ప ప్రతివిమర్శ చేయలేదు. 

దాంతో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్ గా మారిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలతో బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుంది కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ లేనని ఆరోపించారు. 

టికెట్స్ కోసం, స్వార్థ రాజకీయాల కోసం ఎన్టీఆర్ ను వాడుకున్నారని కొడాలి నాని, వల్లభనేని వంశీల గురించి మెుత్తం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత టీడీపీకి దూరమయ్యారని స్పష్టం చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేసింది చంద్రబాబు నాయుడు కాదని మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లేనని బోండా ఉమా ఆరోపించారు. అయినా జూనియర్ ఎన్టీఆర్ అంశం అప్రస్తుతం అంటూ కొట్టిపారేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశాడంటూ నిప్పులు చెరిగారు. 
ఆరు నెలల్లో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించారంటూ మండిపడ్డారు.  

రాష్ట్రంలో ఆదాయం పడిపోయిందిని ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకు వస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మద్యపాన నిషేధంపేరుతో దుర్మార్గమైన మద్యం పాలసీ తీసుకు వచ్చారని మండిపడ్డారు. ఏపీలో అక్రమ మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. 

ఇసుక కొరత తో ఉపాధి కోల్పోయి కార్మికులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని అయినా ప్రభుత్వంలో చలనం లేదంటూ ధ్వజమెత్తారు. మాతృభాషను చంపడానికి వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ ఇంగ్లీషు మీడియం ప్రవేశానికి వ్యతిరేకం కాదని కానీ తెలుగు భాషను చంపే ప్రయత్నం చేయడాన్ని తట్టుకోలేకపోతుందని మండిపడ్డారు. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం జరుగుతుందంటూ కీలక ఆరోపణలు చేశారు.  

హిందువులు మనోభావాలపై మంత్రి కొడాలని నాని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయన్నారు. టీటీడీపై నాని వాడిన భాష బాధాకరమన్నారు. అబ్దుల్ కలాం, సోనియాగాంధీ కూడా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. 

గర్వం తలకెక్కి తిరుమల శ్రీవారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మంత్రి కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు. టీటీడీపై చేసిన వ్యాఖ్యలకు కొడాలి నానితో సీఎం జగన్ క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. 

అమరావతి, పోలవరాన్ని జగన్ ప్రభుత్వం చంపేసిందంటూ రెచ్చిపోయారు. ఇకపోతే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన రాజకీయ అవసరాల కోసమే పార్టీ మారారని చెప్పుకొచ్చారు. వంశీకి చంద్రబాబు నాయుడు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని ఆనాడు చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు.  

సొంత ప్రయోజనాల కోసం వంశీ, దేవినేని అవినాష్ పార్టీ మారారని ఆరోపించారు. వంశీ ,అవినాష్ అధికారం ఎటు ఉంటే అటువైపు వెళ్తారంటూ ధ్వజమెత్తారు. దేవినేని అవినాష్ నిలకడలేని రాజకీయ నాయకుడు అంటూ మండిపడ్డారు. 

అవినాష్, వల్లభనేని వంశీమోహన్ లను జగన్ కూడా నమ్మడని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో వీళ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటాదనండంలో ఎలాంటి సందేహం లేదంటూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.