మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సడెన్ గా మృతి చెందడం.. ఆ మాట వినడానికే బాధాకరంగా ఉందంటూ నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఈ రోజు జరగాల్సిన భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేసుకున్నారు. 

అమరావతి : ‘మంత్రి mekapati goutham reddy హఠార్మణం తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఇక లేరన్న మాట వినడానికే చాలా బాధగా ఉంది. గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబందం లేకుండా అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్దితో పనిచేసేవారు. ‎ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి’ అంటూ సంతాపం తెలిపారు నటుడు, టీడీపీ శాసనసభ్యులు nandamuri balakrishna.

ఇక మేకపాటి మృతికి సంతాపంగా జనసేన అధినేత, నటుడు pawan kalyan సంతాపం వ్యక్తం చేస్తూ.. ఈ రోజు జరగాల్సిన భీమ్లానాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేశారు. ఈ మేరకు జనసేన తరఫున ఒక అధికారక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం.. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణసంస్థ తెలియజేస్తుంది అటూ ప్రకటించారు. 

కలెక్షన్ కింగ్ mohan babu కూడా గౌతమ్ రెడ్డి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘నాకు అత్యంత ఆత్మీయులు, సహృదయులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్‌ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి గారు గుండెపోటుతో పరమపదించారని తెలిసి మా ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నాము. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము’ అంటూ ట్విటర్ వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఇక రామానాయుడు స్టూడియోస్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు మేకపాటి జూబ్లీహిల్స్ లోని గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. భౌతికకాయాన్ని దర్శించుకుని తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంచి వ్యక్తి, మిత్రుడు ఇలా హఠాత్తుగా వెళ్లిపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి Mekapati Goutham Reddy హఠాన్మరణంపై ముఖ్యమంత్రి YS Jagan తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషాదంలో మునిగిపోయారు. విషయం తెలియగానే అయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.

తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వై.విసుబ్బారెడ్డి, చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు సాలోమన్‌ ఆరోకియా రాజ్, రేవు ముత్యాలరాజు, ధనుజంయ్‌ రెడ్డిలతో ముఖ్యమంత్రితో తన నివాసంలో సమావేశమయ్యారు. గౌతంరెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. చిన్ననాటినుంచే తనకు బాగా పరిచయమంటూ ముఖ్యమంత్రి ఆవేదనలో మునిగిపోయారు.

ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుడ్ని కోల్పోయానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధికి విశేష కృషిచేశారని. ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకు వచ్చారని సీఎం అన్నారు. 

రెండుసార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొంది ఉజ్వలభవిష్యత్తు ఉన్న నాయకుడ్ని కోల్పోయానని ఆవేదనవ్యక్తంచేశారు. గౌతం రెడ్డి మరణం తనకే కాదు, రాష్ట్రానికే తీరని లోటని అన్నారు. వెంటనే ఆయన గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. నేరుగా హైదరాబాద్‌ చేరుకుని మంత్రి మేకపాటి నివాసానికి చేరుకుంటారు. అక్కడే ఆయనకు నివాళులు అర్పిస్తారు.అంతేకాదు, మంత్రి గౌతంరెడ్డి మరణంతో 2 రోజులపాటు సంతాప దినాలుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికార లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. సంతాప సూచకంగా జాతీయపతాకాన్ని అవనతం చేస్తారు.