2021వ సంవత్సరానికి గాను సినీ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప చిత్రాలు సత్తా చాటాయి.

2021వ సంవత్సరానికి గాను సినీ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప చిత్రాలు సత్తా చాటాయి. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అవార్డులు సాధించిన వారికి తమ తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన హిందుపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.. జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాలకు అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సినిమా సత్తా ప్రపంచ స్థాయిలో వెలిగిపోతుందని పేర్కొన్నారు. 

65 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సోదరుడు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం నటుడిగా తనకు చాలా గర్వంగా ఉందని అన్నారు. తెలుగు చలనచిత్ర రంగానికే ఇదొక గర్వకారణం అని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి ఆరు అవార్డులు వచ్చాయని.. ఆ చిత్రం ఇక్కడే కాకుండా, ఆస్కార్ స్థాయిలో సత్తా చాటిందని గుర్తుచేశారు. ఉప్పెన సినిమాకు కూడా అవార్డు రావడం సంతోషంగా ఉందని.. వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా చెప్పారు. 

తెలుగు చిత్రపరిశ్రమ సత్తా అందరికి తెలిసి వచ్చిందని అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మంచి మంచి సినిమాలు తీస్తుందని అన్నారు. ఒక్కప్పుడు కొన్ని భాషలకే అవార్డులు పరిమితం అయ్యాయని అన్నారు. అలాంటి అవార్డులను తెలుగు చిత్ర పరిశ్రమ కైవసం చేసుకోవడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. అన్ని భాషాల వారు తెలుగు సినిమాలను ఆదరిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెబుతున్నట్టుగా చెప్పారు. అదే సమయంలో నంది అవార్డుల గురించి ప్రశ్నించగా.. ఆయన చిరునవ్వు నవ్వారు. 

ఇక, 2021లో సెన్సార్ పూర్తిచేసుకున్న సినిమాలు 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ బరిలో నిలిచాయి. ఆర్ఆర్ఆర్ ఆరు అవార్డ్ లు కైవసం చేసుకోగా.. ఇక పుష్ప రెండు జాతీయ అవార్డ్ లను గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ను నేషనల్ అవార్డు వరించింది. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్.. ఉత్తమ జాతీయ సంగీత దర్శకుడి అవార్డును కైవసం చేసుకున్నారు. 

ఇక, ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్యం).. ఎమ్ ఎమ్ కీరవాణి, ఉత్తమ కొరియోగ్రాఫర్.. ప్రేమ్ రక్షిత్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్.. శ్రీనివాస్ మోహన్, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫర్.. కింగ్ సాలోమన్, ఉత్తమ గాయకుడు.. కాల భైరవ, ఉత్తమ ఎంటర్టైన్మెంట్ చిత్రం.. నిర్మాత డివివి దానయ్య‌లకు అవార్డు దక్కింది.