ఇప్పటి వరకూ హైదరాబాద్ కు తన వల్లే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని మాత్రమే చెప్పుకుంటున్న చంద్రబాబు తాజాగా ఇండియా అంటే ఏపినే అనే స్ధాయికి రాష్ట్రాన్ని తెచ్చానని చెప్పుకోవటం గమనార్హం.
చంద్రబాబునాయుడు దేశంలోని ఓ రాష్ట్రానికి మాత్రమే తాను ముఖ్యమంత్రినన్న విషయం మరచిపోయినట్లున్నారు. ఏకంగా దేశానికి ప్రధానమంత్రో లేక రాష్ట్రపతో అని అనుకుంటున్నట్లుంది. ఎందుకంటే, ఆహ్వానాన్ని కొనుక్కుని మరీ దావోస్ పర్యటించిన వచ్చిన చంద్రబాబు తన వల్లే దేశానికి గుర్తింపు వచ్చిందని చెప్పారు. దావోస్ పర్యటన గురించి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఇండియా అంటే ఏపి మాత్రమేనన్నారు. తానుపడుతున్న శ్రమవల్లే రాష్ట్రానికి ఇంతటి గుర్తింపు వచ్చిందని చెప్పుకున్నారు.
ఇప్పటి వరకూ హైదరాబాద్ కు తన వల్లే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని మాత్రమే చెప్పుకుంటున్న చంద్రబాబు తాజాగా ఇండియా అంటే ఏపినే అనే స్ధాయికి రాష్ట్రాన్ని తెచ్చానని చెప్పుకోవటం గమనార్హం. మరి ఈ మాట వింటే ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏమంటారో. గడచిన రెండున్నరేళ్ళలో భారత్ కు గుర్తింపు తెచ్చేందుకే తాను ప్రపంచమంతా తిరుగుతున్నట్లు మోడి ఇంతకాలం చెప్పుకునే వారు. అంటే మోడి ఇంతకాలం చెప్పిందంతా అబద్దమని చంద్రబాబు స్టేట్ మెంట్ తో తేలిపోయింది.
ఇక, ప్రత్యేకహోదా అంటేనే చంద్రబాబు ఉల్లిక్కిపడుతున్నారు. జల్లికట్టుకు ప్రత్యేకహోదాకు ఏమిటి పోలికంటూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. పాలనానుభవం లేని వారే ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరి అదే నిజమైతే, ఎన్నికల సమయంలో రాష్ట్రానికి 15 ఏళ్ళు ప్రత్యేకహోదా కావాలని ఎందుకు డిమాండ్ చేసారో నిప్పు చంద్రబాబు చెబితే బాగుంటుంది. ఇక, రాష్ట్రం బాగా అభివృద్ధి జరుగుతున్నపుడు ప్రత్యేకహోదా ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఏరంగంలో రాష్ట్రం అభివృద్ధి జరిగిందో బాబుగారే చెప్పాలి. పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు లేవు. కొత్తగా ఉద్యోగాల కల్పన జరగలేదు. మౌళిక సదుపాయలు కూడా లేవు.
అవినీతిలో ఏపినే నెంబర్ 1 అని కొన్ని సంస్ధలు రేటింగ్ ఇచ్చాయి. రెవిన్యూ, పోలీసు, అటవీ, మున్సిపాలిటీ తదితర శాఖల్లో బాగా అవినీతి పేరుకుపోయిందని ఘటన వహించిన చంద్రబాబే ఎన్నోమార్లు చెప్పారు. లంచం ఇవ్వనిదే రాష్ట్రంలో ఏపనీ కావటం లేదని ఏకంగా మిత్రపక్షమైన భాజపా ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజే స్వయంగా ప్రకటించారు. అవినీతి పెరిగిపోతోంది కాబట్టి ధైర్యముంటే అవినీతిపరులైన ఐదుగురు ఎంఎల్ఏలను కాల్చి చంపాల్సిందిగా భాజపాకు చెందిన ఎంఎల్సీ సోము వీర్రాజే మావోయిస్టులకు సవాలు విసిరటం గమనార్హం. అంటే చంద్రబాబు స్టేట్ మెంట్ చూస్తుంటే అర్ధమైపోతోందేమిటంటే ప్రత్యేకహోదాకు తాను వ్యతిరేకమనే.
