కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టేయండని ఏడాదిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెదిరించడమే తప్ప చేసింది లేదు. ఇపుడు తాజాగా అమరావతిలో రోడ్లేస్తున్న వాళ్లని బ్లాక్ లిస్టులో పెట్టేయండని కసురుకున్నారట.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కొత్త ఊత పదమొకటి దొరికింది. ఈ మధ్య ఏ సమీక్ష జరిగినా ఆయన ఈ పదాన్ని చంద్రాస్త్రం లాగా ప్రయోగిస్తానని బెదరగొడుతున్నారు. అయినా సరే ఎవరూ బెదరక పోవడం వేరే విషయం.
’బ్లాక్ లిస్టులో పెట్టేయండి’ అనేది ఆయన దొరికిన తాజా ఊత పదం. ప్రతి సమీక్ష లో తన కొత్త బాణం ప్రయోగిస్తున్నారు.అయితే, అదెవరికి తగలుతున్నట్లు లేదు.
’ఆశించిన రీతిలతో పనులు జరగడం లేదు. కాంట్రాక్టర్లు సరిగ్గా పనిచేయడం లేదు’ అని ఒక మాట అనేసి, దారికి రాకపోతే, బ్లాక్ లిస్టులో పెట్టేయండని బెదిరిస్తున్నారు. ప్రతి సోమవారం పోలవరం మీటింగ్ లో ఈ మాటే వినబడుతుంది. సిఆర్ డి ఎ రివ్యూ ఎపుడూ జరిగినా ఇదే మాటే రిపీటవుతుంది. ఒకటిన్నర కాలంగా ఈ అదిలింపులు, బెదిరింపులు వినబడుతున్నా ఒక్క కాంట్రాక్టర్ ని కూడా బ్లాక్ లిస్టులోపెట్టిన దాఖలా లేదు.
ఈ రోజు కూడా ముఖ్యమంత్రి నాయుడు అమరావతి రోడ్ల పనులను సీరియస్ గా రివ్యూ చేశారు. ’అమరావతిని సకాలంలో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే విషయంలో రాజీపడేది లేదు’ అని సీరియస్ గా వార్నింగ్ఇచ్చారు.
రోడ్ నెట్‌వర్క్ పనులు మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనులు సకాలంలో పూర్తి చేయకుంటే కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా రూ. 3,600 కోట్లతో 270 కిలోమీటర్ల ప్రధాన రహదారిని, దానికి అనుబంధంగా 130 కిలోమీటర్ల రహదారులను ముందుగా పూర్తి చేయాల్సిందే నని స్పష్టం చేశారు.
బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో అమరావతి నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అమరావతిలో గ్యాస్, తాగునీరు, టెలిఫోన్-విద్యుత్ లైన్లు, డ్రైనేజ్ వంటి వన్నీ ఒకే మార్గంలో పైపులలో ఏర్పాటు చేయాలని, దీని కోసం సింగపూర్ నుచూసి నేర్చుకోండని చెప్పారు. 2018 నాటికి జాతీయ క్రీడలు నిర్వహించ గలిగేలా అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రాంగణాలు నిర్మించాల్సి వుందని, ఇందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా చెప్పారు.
అమరావతిలో విద్యాలయాలు, ఆస్పత్రులు, హోటళ్లు ఒకే ప్రాంతంలో కాకుండా నగరం నలుమూలలా వుండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడతో పాటు అటు గుంటూరు నగరాభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.
