ప్రతీ శాఖపైనా స్వయంగా చంద్రబాబే సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో మంత్రులకు ఉన్నతాధికారులకు మధ్య గ్యాప్ పెరిగింది. ఫలితంగా శాఖలపైన మంత్రులకు పెద్దగా పట్టు లేదు.
చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేల్లో మంత్రివర్గంలోని పలువురి పనితీరు బాగాలేదని నివేదికలు అందుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సిఎం పలుమార్లు బాహాటంగానే చెబుతున్నారు. అయినా పనితీరు పెంచుకునేందుకు, శాఖలపై పట్టు పెంచుకుంనేందుకు ప్రయత్నించటం లేదు. దాంతో చంద్రబాబులో అసంతృప్తి పెరిగిపోతోంది.
మంత్రివర్గంలోని 19 మందిలో చాలా మంది కొత్తవారే. మంత్రుల సంఖ్య తక్కువ, శాఖలు ఎక్కువ. నాలుగు శాఖలు పర్యవేక్షిస్తున్న మంత్రులు కూడా ఉన్నారు. దాంతో ఏ ఒక్కరికీ తమ శాఖలపై పట్టు లేదు. పట్టు పెంచుకునేందుకు కూడా పలువురు ప్రయత్నించటం లేదు.
ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చారు. అసలే అప్పులతో మొదలైన ప్రభుత్వంపై వస్తున్న కొద్ది ఆదాయాలు హామీల అమలుకే సరిపోవటం లేదు. దాంతో ఏ శాఖలోనూ అంచనా ప్రకారం పనులు జరగటం లేదు.
రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీలు, పెరిగిన ఫించన్లు, చంద్రన్న కానుకలు ఇలా..అనేక ఆకర్షణీయ పథకాలతో ఖజానా గుల్లైపోతోంది. వచ్చే ఆదాయంలో సగానికిపైగా సంక్షేమ పథకాలకే వ్యయం అయిపోతోంది. ఉద్యోగుల, పెన్షనర్ల వ్యయానికి వివిధ దుబారా ఖర్చులు అదనం.
ఇవన్నీ ఓ ఎత్తైతే, రాజధానిని హైదరాబాద్ నుండి అర్ధాంతరంగా విజయవాడ ప్రాంతానికి మార్చేయటం ఓ ఎత్తు. హైదరాబాద్ నుండి వెలగపూడికి వెళ్లటం మంత్రులు, ఉన్నతాధికారులు, శాసనసభ్యులు ఎవరికీ ఇష్టం లేదు. అయినా బలవంతంగా వెళ్లాల్సి రావటం అందరిలోనూ అసంతృప్తే. ఇదంతా పాలనపై స్పష్టంగా కనబడుతోంది.
దానికి తోడు గడచిన ఏడాది నుండి ఎప్పటికప్పుడు మంత్రివర్గంలో మార్పులుంటాయని ప్రచారం జరుగుతోంది. మంత్రుల్లో ఎవరికి ఉధ్వాసన ఉంటుందో తెలీదు కాబట్టి ఎవరికి వారు అభద్రతతో కౌంటర్లు తెరిచారనే ప్రచారం మొదలైంది.
ప్రతీ శాఖ విషయంలోనూ స్వయంగా చంద్రబాబే సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో మంత్రులకు ఉన్నతాధికారులకు మధ్య గ్యాప్ పెరిగింది. ఫలితంగా శాఖలపైన మంత్రులకు పెద్దగా పట్టు లేదు.
గనుల శాఖ మంత్రి పీతల సుజాత, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, హెచ్ఆర్డి మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రెవిన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులపై అవినీతి ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి.
సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప, గృహనిర్మాణ శాఖ మంత్రి మృణాళిని, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు తమ శాఖలపై పట్టు లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ఇక, కార్మిక, యువజన శాఖల మంత్రి అచ్చెన్నాయడు, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ల పనితీరు సంతృప్తికరంగా లేదని సిఎం ఎన్నో సార్లు అసంతృప్తి వ్యక్తం చేసారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పనితీరు ఏదో పర్వాలేదన్నట్లున్నది. నారాయణ పేరుకే మున్సిపల్ శాఖ మంత్రి. ఆయన రాజధాని నిర్మాణ బాధ్యతలు ప్రత్యేకంగా మోపటంతో ఆయనకు మున్సిపల్ శాఖను పట్టించుకునే తీరికే లేదు.
ఇక యనమల చేయటానికి పెద్దగా ఏమీ లేదు. ఈ టీంలో మార్పలు చేయాలనే చంద్రబాబూ అనుకుంటున్నా ఎందుకో పడటం లేదు. మరి ఎప్పుడు మారుస్తారో చూడాలి.
